న్యూఢిల్లీ: నవరాత్రి పండుగ సీజన్‌లో దేశీయ వాహన రిజిస్ట్రేషన్లు వార్షిక ప్రాతిపదికన 6.5 శాతం నెమ్మదించాయి. ఈ ఏడాది అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు జరిగిన నవరాత్రుల్లో మొత్తం వాహన రిటైల్ అమ్మకాలు 11.23 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే పండుగ సమయంలో (సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2, 2025 వరకు) ఈ అమ్మకాలు 12.01 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.
గతేడాది ఉన్న 'హై బేస్' ప్రభావం కారణంగానే ఈ తగ్గుదల కనిపిస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ పేర్కొంది. 2025లో నవరాత్రి తొలి రోజే వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్ల తగ్గింపు అమల్లోకి రావడంతో డీలర్‌షిప్‌లలో కొనుగోళ్ల రద్దీ అప్పట్లో భారీగా పెరిగింది. అన్ని విభాగాల కంటే ప్యాసింజర్ వెహికల్ (పీవీ) విభాగం తీవ్రమైన పతనాన్ని చవిచూసిందని ఫాడా నివేదిక వెల్లడించింది.
విభాగాల వారీగా రిజిస్ట్రేషన్లు
వాణిజ్య వాహనాలు (సీవీలు), ట్రాక్టర్లు మినహా మిగిలిన అన్ని విభాగాల్లోనూ రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ప్రయాణికుల వాహనాల (పీవీ) రిజిస్ట్రేషన్లు 21.9 శాతం తగ్గి 1.83 లక్షలకు పడిపోగా, టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు 2.8 శాతం తగ్గి 8.34 లక్షలకు చేరాయి. మరోవైపు త్రిచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 7.5 శాతం తగ్గి 45,735 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే కమర్షియల్ వాహనాలు (సీవీలు) 1.1 శాతం పెరిగి 35,618 యూనిట్లకు, ట్రాక్టర్లు 0.9 శాతం పెరిగి 22,690 యూనిట్లకు చేరాయి.
స్వల్ప తగ్గుదల సాంకేతికమైనదే
‘‘గత ఏడాది నవరాత్రులు 11 రోజులు జరగగా, ఈసారి 10 రోజులే ఉండటం, పైగా జీఎస్‌టీ 2.0 రోల్-అవుట్ వంటి కారణాలతో గతంలో భారీగా పెరిగిన డిమాండ్ ఈసారి కనిపించలేదు. ఈ 6.52 శాతం స్వల్ప తగ్గుదల అనేది కేవలం సాంకేతికమైనదే’’ అని ఫాడా అధ్యక్షుడు సాయి గిరిధర్ స్పష్టం చేశారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగం మాత్రం సత్తా చాటిందని, ఈవీ రిటైల్ అమ్మకాలు 26.78% వృద్ధి చెంది పండుగ అమ్మకాల్లో దాదాపు 10.5 శాతానికి చేరాయని తెలిపారు.
ఆటో కంపెనీల స్పందనలు
తమ డెలివరీలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు సమానంగా (సుమారు 98 శాతం) ఉన్నాయని, ఉత్పత్తి సామర్థ్య పరిమితులు ఇందుకు కారణమని మారుతీ సుజుకీ కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. ఓనం నుండి దసరా వరకు రిటైల్ అమ్మకాలు 30 శాతం వృద్ధి చెందాయని, దీపావళి వరకు ఇదే జోరు కొనసాగుతుందని బెనర్జీ అంచనా వేశారు.
పండుగ సమయంలో డిమాండ్ బలంగా ఉందని, నవరాత్రుల్లో 50,000 పైగా వాహనాలు డెలివరీ చేశామని, ఒక్క దసరా రోజే 10,000 పైగా వాహనాలు కస్టమర్లకు చేరవేసినట్లు టాటా మోటార్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అమిత్ కామత్ వెల్లడించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉందని హ్యుందాయ్ మోటార్స్ ఎండీ, సీఈవో తరుణ్ గార్గ్ తెలిపారు. మహాలయ పక్షాల నుండి నవరాత్రి మధ్య రిజిస్ట్రేషన్లు 30 శాతం పెరిగి దాదాపు 41,000 యూనిట్లకు చేరాయని, ధనత్రయోదశి, దీపావళి వరకు ఇదే జోరు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


