మైసూరు: సుమారు 2 నెలల పాటు మైసూరు వాసులతో పాటు అశేష పర్యాటకులను అలరిస్తూ మైసూరు దసరా మహోత్సవాలను విజయవంతం చేసిన ఏనుగుల దండు అందరి హృదయాలను గెలుచుకుంది.
కానీ వాటి మైసూరు మజిలీ గురువారంతో సమాప్తమైంది. భారమైన మనస్సులతో వేలాదిమంది వీడ్కోలు మధ్య గజరాజులు అడవుల్లోని శిబిరాలకు పయనమయ్యాయి.
బుధవారం దసరా జంబూ సవారీ వేడుక జయప్రదంగా జరగడం తెలిసిందే. అంతటితో ఏనుగుల బాధ్యత పూర్తయింది. దీంతో గురువారం ఉదయం నుంచి ప్యాలెస్‌లో ఏనుగుల షెడ్లలో కోలాహలం మాయమైంది.
మావటీలు, వారి కుటుంబాలు తట్టా బుట్టా సర్దుకున్నారు. ప్యాలెస్, అటవీ అధికారులకు గజరాజులకు వీడ్కోలు వేడుకను నిర్వహించారు.
వాటికి అల్పాహారం పూర్తయ్యాక జయమార్తాండ ద్వారం వద్ద కెప్టెన్ ప్రశాంత్, అభిమన్యు సహా ఏనుగులను వరుసగా నిలబెట్టారు. పూజారి ప్రహ్లాద రావు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత ఏనుగులను ఒక్కొక్కటిగా లారీల్లోకి ఎక్కించి వాటి శిబిరాలకు పంపించారు.
రోజూ ఏనుగుల శిక్షణను చూస్తూ సంబరపడే నగరవాసులు అభిమాన ఏనుగులు వెళ్ళిపోవడాన్ని నిశ్శబ్దంగా చూశారు. టాటా, బైబై అని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.


