ఫ్రాన్స్‌లో భారతీయులకు కేంద్రం హెచ్చరిక! | Indian Embassy issues safety advisory for nationals in France | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌లో అల్లకల్లోలం.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక!

Oct 22 2026 10:40 AM | Updated on Oct 22 2026 10:40 AM

Indian Embassy issues safety advisory for nationals in France

అల్లర్లు.. విధ్వంసాలు.. కర్ఫ్యూలతో ఫ్రాన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్రాన్స్‌లో మరోసారి నిరసనలు, సమ్మెలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు, పర్యటనకు వెళ్లినవారు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

ఫ్రాన్స్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, పలు ప్రాంతాల్లో అమలవుతున్న స్థానిక కర్ఫ్యూల నేపథ్యంలో భారతీయులు జాగ్రత్తగా ఉండాలని పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, నిరసనలు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లొద్దని స్పష్టం చేసింది.

ఫ్రాన్స్‌లోని పరిస్థితులపై స్థానిక వార్తలు, ప్రభుత్వ అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని భారతీయులకు సూచించింది. ఫ్రాన్స్‌ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని తెలిపింది. పారిస్‌ ప్రాంతంలో ప్రజా రవాణా సేవలకు సంబంధించిన మార్పులు, అంతరాయాల కోసం RATP వెబ్‌సైట్‌ను తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం లేదా మార్సెయ్‌లోని భారత కాన్సులేట్‌ను సంప్రదించాలని సూచించింది.

పాఠశాలల సమస్యలతో మొదలై.. 
ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో నిధుల కొరత, విద్యార్థుల రద్దీ వంటి సమస్యలపై సెప్టెంబర్‌ చివర్లో ప్రారంభమైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్త ఆందోళనలుగా మారాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, ప్రభుత్వ ప్రజా సేవల్లో కోతలపై అసంతృప్తి కూడా ఉద్యమానికి తోడైంది. నిరసనల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో దోపిడీలు, నిప్పంటించే ఘటనలు, పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్‌ 17న జరిగిన నిరసనల సందర్భంగా హింస చెలరేగడంతో పారిస్‌తో పాటు లిల్లే, లియోన్‌, నీస్‌ వంటి నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూలు విధించారు. మార్సెయ్‌లోనూ సమావేశాలు, ప్రదర్శనలపై ఆంక్షలు అమలు చేశారు. వారాంతంలో జరిగిన అల్లర్లకు సంబంధించి 2,400 మందికి పైగా అరెస్టయ్యారని, దాదాపు వెయ్యి మంది పోలీసు అధికారులు గాయపడ్డారని మీడియా కథనాలు వెల్లడించాయి.

శనివారం మరోసారి నిరసనలు.. నవంబర్‌ 5న సమ్మె
ఫ్రాన్స్‌లో మరోసారి ఆందోళనలు జరిగే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హింస పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ప్రకటించారు. ప్రధాన విద్యార్థి సంఘం, 2018–19లో ఇంధన ధరల పెంపుపై నిరసనలు చేపట్టిన ఎల్లో వెస్ట్‌ ఉద్యమానికి చెందినవారు శనివారం ర్యాలీలకు పిలుపునిచ్చారు. జీవన వ్యయం పెరుగుదల, ప్రజా సేవల్లో కోతలకు నిరసనగా నవంబర్‌ 5న సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి.

ఇదీ చదవండి: బీజేపీపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement