లిస్టింగ్‌కు రెండు కంపెనీలు రెడీ | Sembcorp Green Infra Razorpay Get SEBI for IPOs | Sakshi
Sakshi News home page

లిస్టింగ్‌కు రెండు కంపెనీలు రెడీ

Nov 14 2026 1:54 PM | Updated on Nov 14 2026 2:06 PM

Sembcorp Green Infra Razorpay Get SEBI for IPOs

కొన్ని రోజులు డీలాపడిన సెకండరీ మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మళ్లీ పుంజుకోగా.. మరోపక్క ప్రైమరీ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. తాజాగా రెండు కంపెనీల లిస్టింగ్‌కు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ జాబితాలో ఫిన్‌టెక్‌ కంపెనీ రేజర్‌పే సాఫ్ట్‌వేర్, పునరుత్పాదక ఇంధన స్వతంత్ర విద్యుదుత్పత్తి కంపెనీ సెంబ్‌కార్ప్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రా చేరాయి. గోప్యతా మార్గంలో రేజర్‌పే సెబీకి జూన్‌లో దరఖాస్తు చేయగా.. సెంబ్‌కార్ప్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రా ఆగస్ట్‌లో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది.

రూ. 3,500 కోట్లపై కన్ను
ప్రాస్పెక్టస్‌ ప్రకారం సెంబ్‌కార్ప్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రా పూర్తిగా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఐపీవో చేపట్టనుంది. ఇందుకు అనుగుణంగా ఈక్విటీ షేర్లను  కొత్తగా జారీ చేయనుంది. తద్వారా రూ. 3,500 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూ నిధులను అనుబంధ సంస్థలు, కంపెనీకి చెందిన ఎంపిక చేసిన రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. తద్వారా రెనెవబుల్‌ ఎనర్జీ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునేందుకు వీలుగా బ్యాలన్స్‌షీట్‌ను పటిష్టపరచుకోనుంది.

ప్రస్తుతం 3.6 గిగావాట్ల నిర్వహణలోని రెనెవబుల్‌ ఎనర్జీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2026 మార్చి31కల్లా మరో 4.04 జీడబ్ల్యూ నిర్మాణంలో ఉంది. దీనిలో 1,433 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌(బీస్‌) సామర్థ్యం కలసి ఉంది. హైబ్రిడ్, స్టోరేజీ దన్నుగల, 24గంటలు పనిచేయగల, డిస్పాచబుల్‌ రెనెవబుల్‌ ఎనర్జీ(ఎఫ్‌డీఆర్‌ఈ) తదితర క్లిష్టతరహా రెనెవబుల్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. సింగపూర్‌ సంస్థ సెంబ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ దేశీ అనుబంధ విభాగం ఇది. పీఈ సంస్థ టెమాసెక్‌కు పెట్టుబడులున్నాయి. గతేడాది(2025-26) ఆదాయం రూ. 2,652 కోట్లను అధిగమించగా.. నికర లాభం రూ. 371 కోట్లను తాకింది. నిర్వహణ లాభం రూ. 2,099 కోట్లకు చేరింది.

రూ. 5,000-6,000 కోట్లకు సై
రహస్య పద్ధతిలో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసిన రేజర్‌పే పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 5,000-6,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో ఏర్పాటైన కంపెనీ సమీకృత ప్లాట్‌ఫామ్‌ ద్వారా చెల్లింపులు, పేరోల్, లెండింగ్‌ తదితర ఫైనాన్షియల్‌ సంబంధిత సేవలు అందిస్తోంది. ఈ బాటలో స్టార్టప్‌లుసహా భారీ కార్పొరేట్లకూ సరీ్వసులు సమకూర్చుతోంది. 2020లో యూనికార్న్‌ గుర్తింపు పొందిన కంపెనీలో పీక్‌ 15 పార్ట్‌నర్స్, జీఐసీ, టైగర్‌ గ్లోబల్, రిబ్బిట్‌ క్యాపిటల్‌ తదితర సంస్థలకు పెట్టుబడులున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement