సత్యం, ప్రేమ, అహింసతో మోదీని ఓడిస్తాం | Rahul Gandhi attended Bharat Summit 2026 in Hyderabad | Sakshi
Sakshi News home page

సత్యం, ప్రేమ, అహింసతో మోదీని ఓడిస్తాం

Nov 15 2026 1:59 AM | Updated on Nov 15 2026 1:59 AM

Rahul Gandhi attended Bharat Summit 2026 in Hyderabad

భారత్‌ సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రాహుల్‌ గాందీ. వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, సల్మాన్‌ ఖుర్షీద్, భట్టి విక్రమార్క, అడ్లూరి, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, జూపల్లి, పొన్నం, యూరోపియన్‌ సోషలిస్టుల నేత గియాకోమో ఫిలిబెక్, పొంగులేటి, ఉత్తమ్, యూరోపియన్‌ పార్లమెంట్‌ మాజీ సభ్యురాలు డాక్టర్‌ మరియా రోడ్రిగ్స్‌ తదితరులు

భారత్‌ సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ

వారికి ఆర్థికంగా, వ్యవస్థీకృతంగా ఎంత బలమున్నా... ప్రజలతో మాకున్న ప్రత్యక్ష సంబంధమే గొప్పది 

దేశంలో పదేళ్లుగా ప్రతిపక్షం ఉనికిలో లేదు... ఫాసిస్టు పాలన నడుస్తోంది 

2024 ఎన్నికల్లో ఓటేసిన 14 కోట్ల మంది ఓటర్లు అర్హులు కారని తేల్చారు 

అలాంటప్పుడు ఆ ఎన్నికలకు చట్టబద్ధత ఎలా వస్తుంది?  

దేశంలో రాజకీయాలు, వ్యాపారాల మధ్య సంబంధం ఏర్పడింది 

పెద్దఎత్తున సమకూరిన నగదు.. రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తోంది 

మేం వాళ్లను ద్వేషించదల్చుకోలేదు... ప్రేమ, అహింసతోనే గెలుస్తాం

సాక్షి, హైదరాబాద్‌: దేశం అభివృద్ధి పథంలో నడిచేందుకు ఉపకరించిన వ్యవస్థలను నాశనం చేసి మిలియన్ల కొద్దీ డాలర్లను రాజకీయాల్లోకి జొప్పించారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. పెద్దఎత్తున సమకూరిన నగదు ఈ దేశ రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తోందని, రాజకీయాలు, వ్యాపారాల మధ్య అవినాభావ సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రతిపక్షంగా తామేం చేయాలో అన్నీ చేశామని, కానీ వారిని ఏమీ చేయలేకపోయామని, ఇందుకు ఆర్థిక శక్తి, అధికారమే కారణాలన్నారు.

ఇలాంటి సమయంలోనే తమకు మహాత్మాగాంధీ చూపిన సత్యం, అహింస కొత్త మార్గాలుగా కనిపించాయని చెప్పారు. సత్యం, అహింస, ప్రేమతోనే మోదీని ఓడించి తీరుతామని, ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీన్ని ప్రపంచం చూస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో భారత్‌సమ్మిట్‌–2026 ముగింపు కార్యక్రమంలో రాహుల్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.  

వీరు రాజకీయాల్లో ఫాసిస్టులు 
‘ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం అనుమతించని కారణంగా రాలేకపోయినా పలు దేశాలకు చెందిన నాయకులు, ప్రముఖులకు క్షమా పణలు చెబుతున్నా. ఇలా అడ్డుకోవడమే మేం ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామో తెలియజేస్తుంది.   తమకే అన్నీ తెలుసని, అన్నీ అర్థం చేసుకోగలమని, అన్నింటికి సమాధానం ఉందని భావించే వ్యక్తులు అన్ని రంగాల్లో ఉంటారు. వ్యాపార అధిపతులుగా, విద్యావేత్తలుగా కనిపిస్తుంటారు.

రాజకీయాల్లో వీరిని ఫాసిస్టులుగా పిలుస్తుంటాం. పదేళ్లుగా ఈ ఫాసిస్టులు అలజడి చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. భారత్‌లో అయితే మాకు చాలా అనుభవాలున్నాయి. చాలా పాఠాలు నేర్చుకున్నాం. 2014 ఎన్నికలు చాలా భిన్నంగా జరిగాయి. గతంలో అలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. మిలియన్లకొద్దీ డాలర్లను రాజకీయ వ్యవస్థలోకి జొప్పించారు. పూర్తిగా విభిన్న తరహాలో ప్రచారం నిర్వహించారు. అప్పుడు జరిగిన డ్రామా గతంలో ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా ఎన్నికల వ్యవస్థలో గట్టి పోటీ ఉంటుంది.

కూటములు ఏర్పడతా యి. కానీ అలాంటివేవీ ఈ ఎన్నికల తర్వా త లేవు. ప్రతిపక్షం ఉనికిలో లేకుండా పోయింది. ఒకటి, రెండు రోజులు కాదు దశాబ్ద కాలంగా దేశంలో ప్రతిపక్షం లేదు. పార్టీల పరిస్థితేంటో? అసలు ఏం జరు గుతోందో? మీ మీ పార్టీల సిద్ధాంతాలు ఏ మేరకు సఫలీకృతమవుతున్నాయో రాజకీయ నాయకులు తమను తాము ప్రశ్నించుకోవాలి’ అని రాహుల్‌ గాంధీ చెప్పారు. 

పసిగట్టాం... ప్రారంభించాం 
‘పదేళ్లుగా భారత రాజకీయ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. దీన్ని మేం పసిగట్టగలిగాం. అసలేం జరుగుతోందో నెమ్మదిగా ఆ తర్వాత కనుక్కోవడం ప్రారంభించాం. 2014లోనే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విధ్వంసమైందని గుర్తించగలిగాం. 2024 ఎన్నికల్లో ఓటేసిన 140 మిలియన్ల మందిని ఉనికిలో లేని ఓటర్లంటూ కొన్ని నెలల క్రితం తేల్చారు. దేశంలోని 13 శాతం మంది ఓటర్లు అక్రమమని ఎన్నికల సంఘం గుర్తిస్తే.. మరి అప్పుడు జరిగిన ఎన్నికలు ఎలా చట్టబద్ధమవుతాయనే ప్రశ్న తలెత్తుతుంది.

మహారాష్ట్రలో మరో మంచి ఉదాహరణ ఉంది. జాతీయస్థాయిలో జరిగిన ఎన్నికల్లో మా కూటమి అక్కడ గెలిచింది. కానీ, మూడు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. మేం నామమాత్రంగా మిగిలిపోయాం. అసలేం జరిగి ఉంటుందని కనుక్కునే ప్రయత్నం చేశాం. అయితే, రెండు ఎన్నికల్లో మాకు ఒకే సంఖ్యలో ఓట్లు వచ్చాయి. కానీ మూడు నెలల కాలంలో విచిత్రంగా 7 మిలియన్ల మందిని ఓటర్లుగా చేర్చారు.

వారంతా బీజేపీకి ఓటేయడంతో గెలిచేశారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే విధంగా జరుగుతోంది. భారత్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థ భూగ్రహంలోనే గొప్పది. కానీ దేశంలో అసలు ప్రజాస్వామ్యమే లేదని అర్థమవుతోంది. వ్యవస్థ పూర్తిగా నిరీ్వర్యమైపోయింది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఆర్థిక వ్యవస్థ విఫలమైంది. ఐటీ, పరిశ్రమల రంగాలను కుదేలయ్యేలా చేసి భారీస్థాయిలో నోట్లు ముద్రించి పెద్దఎత్తున నగదును అందుబాటులోకి తెచ్చారు. ఆ నగదు దేశ రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తోంది.

దేశంలోని ఒక వ్యాపారి బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రపంచంలోని ధనవంతుల్లో 600వ స్థానంలో ఉన్నాడు. కానీ కొన్ని రోజుల క్రితం ఆయన ప్రపంచ ధనవంతుల్లో రెండో స్థానానికి చేరాడు. ఆయన అత్యంత ధనవంతుడయ్యేందుకు రాజకీయాలు, వ్యాపారాలకు మధ్య ఏర్పడ్డ అవినాభావ సంబంధమే కారణం. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, బ్రిడ్జిలు, సిమెంట్, డిఫెన్స్, మౌలిక సదుపాయాలు... ఇలా అన్ని రంగాల్లో అదానీ ఉంటాడు. ఆస్తులను కొల్లగొట్టాడు. బీజేపీ ఆస్తులు కూడా దశాబ్ద కాలంలో 11 రెట్లు పెరిగాయి. తద్వారా వాళ్లు ఎవరూ ఢీ కొట్టలేనంత ఆర్థిక శక్తివంతులయ్యారు’ అని రాహుల్‌ పేర్కొన్నారు. 

ప్రతిపక్షంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి 
‘ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి. వారిని ఈ దేశంలో ఎదుర్కొనేందుకు మేం అన్ని రకాల ఆయుధాలు ప్రయోగించాం. కానీ సఫలీకృతం కాలేదు. ప్రతిపక్షంగా అసలేం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. మేం ఏది చేసినా మాకు మద్దతు దొరకదు. అన్ని వ్యవస్థలను చేతుల్లోకి తీసుకున్నారు. నాపై 45 కేసులు పెట్టారు. దేశంలో ప్రతి మూలనా ప్రతిపక్ష నేతలపై ఎన్నో కొన్ని కేసులుంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అసలేం చేయాలనే దానిపై దృష్టి సారించాం. వారు ఎన్ని రకాల వ్యవస్థలను తమ ఆ«దీనంలోకి తీసుకున్నా, వారి దగ్గర ఎంత డబ్బున్నా, వారు ఎంత శక్తిమంతులైనా మాకు దేశ ప్రజలతో ఉన్న ప్రత్యక్ష సంబంధం అన్నింటికంటే గొప్పదని అర్థం చేసుకున్నాం. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన లక్షలాది మందిమి ప్రయాణించాం. యాత్ర నిర్వహించాం.

ఎన్నో అద్భుత విషయాలను తెలుసుకోగలిగాం. ప్రజలనుంచి రాజకీయ నాయకులను విడదీసే ఒక అంతరం మధ్యలో ఉందని గుర్తించాం. ఎలాంటి వ్యవస్థలు కూడా నేరుగా మమ్మల్ని ప్రజలకు చేరువ చేయలేవని, తామే వారి దగ్గరకు వెళ్లాలని తెలుసుకోగలిగాం. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీగా ఈ దేశ చరిత్ర మహాత్మాగాందీతోనే ప్రారంభమైందని అనుకునే వాళ్లం. కానీ, అంతకంటే ముందు చాలా ఉందని, భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిలో దాగి ఉందని గుర్తించాం.

చరిత్రను మేం ఎప్పుడూ రాజకీయాల కోసం ఉపయోగించుకోలేదు. అలాంటి ఆలోచన మాకు లేదు. కానీ, గాంధీ ఉపయోగించిన సత్యం, అహింస అనే రెండు పదునైన ఆయుధాలున్నాయని గుర్తించాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవే శక్తివంతమైన ఆయుధాలు. ప్రేమ, సత్యం, అహింస మాత్రమే ఫలితాలనిస్తాయి. అందుకే మా వైఖరి మార్చుకున్నాం. మా భాష మార్చుకున్నాం. పార్టీలో అంతర్గంతంగా అన్ని స్థాయిల్లో ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటున్నాం’ అని రాహుల్‌ చెప్పారు. 

మోదీ ఓటమి చూస్తారు 
‘ప్రేమ, నిజాయితీ, అనుబంధాలకు నూతన ప్రపంచంలో చోటులేదని చాలామంది భావిస్తారు. కానీ కఠిన పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు అది సరికాదని అర్థమవుతోంది. నేను చాలా విశ్వాసంతో చెబుతున్నా.. మేం మోదీని ఓడిస్తాం. మోదీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశ వీధుల్లో, ప్రధానమంత్రి, అమిత్‌షాల్లో కనిపించే భయంలో వారిని ఓడించగలుగుతామని అర్థమవుతుంది. మేం వాళ్లను ద్వేషించదల్చుకోలేదు. ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. మేం చేయాల్సింది మా సిద్ధాంతాలతో చేస్తాం.

ద్వేషం, కోపం కనపడని ఆత్మీయతతో వారిని గెలుస్తాం. వారు ఓడిపోయినప్పుడు సత్యం, ప్రేమ, అహింసలతో జరిగిందని మీరు చూస్తారు. మాతో కలిసి పనిచేస్తున్న వారు, మాలాంటి పరిస్థితులు ఉన్న వారిని ఇంతమందిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. మీతో కలిసి పనిచేస్తాం. ఈ భూగ్రహంలోని ప్రతి మూల నుంచి ఫాసిస్టులను తరిమికొట్టడంలో భాగస్వాములమవుతాం’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement