breaking news
bharat summit 2026
-
నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. పీసీసీ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి వరకు శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు వస్తారు.అక్కడి నుంచి నేరుగా శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి, శనివారం ఉదయం పార్టీ ప్రముఖులతో భేటీ కానున్నారు. అనంతరం నగరంలో జరిగే గిగ్‌వర్కర్ల ర్యాలీలో పాల్గొని వారికి సంఘీభావం తెలుపనున్నారు. అనంతరం అక్కడి నుంచి హెచ్ఐసీసీకి వెళ్లి అక్కడ జరిగే భారత్ సమ్మిట్ ముగింపు ఉత్సవంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. ఖర్గే, డీకే శివకుమార్‌కు భట్టి ఆహ్వానం హైదరాబాద్‌లో ఈ నెల 13, 14 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భారత్ సమ్మిట్–2026కు హాజరు కావాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో ఆయన భేటీ అయ్యారు. సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ఖర్గే, డీకే శివకుమార్లను భట్టి విక్రమార్క కోరారు. ఈ సందర్భంగా భారత్ సమ్మిట్ లక్ష్యాలు, ప్రాధాన్యతలను వారికి వివరించారు. ఈ మేరకు ఇరువురు నేతలు సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
నేటి నుంచి భారత్ సమ్మిట్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ రెండో ఎడిషన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో శుక్రవారం ప్రారంభం కానుంది. ’ఫోర్జింగ్ ఎ న్యూ వరల్డ్’ ఇతివృత్తంతో ఈ నెల 14 వరకు జరిగే ఈ సదస్సులో 50కి పైగా దేశాలకు చెందిన విధాన రూపకర్తలు, మేధావులు, వ్యాపార ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పాల్గొంటున్నారు. భారత స్వాతంత్య్రం 80వ సంవత్సరం, తొలి ప్రధాని నెహ్రూ 137వ జయంతి సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్రెజిల్, హంగరీ, సెర్బియాలలో ప్రోగ్రెసివ్ పార్టీల విజయాలు, అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ ప్రోగ్రెసివ్ నేతల సమావేశం ఇదేనన్నారు. ఈ సదస్సులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్, ప్రపంచంపై తన దృక్పథాన్ని వివరించనున్నారు. శనివారం ముగింపు కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, శాంతియుత సహజీవనం, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా ప్రత్యామ్నాయ విదేశాంగ విధాన దృక్పథాన్ని ఈ వేదికపై ఆవిష్కరించన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆఫ్రో–ఆసియా సంఘీభావం, అలీన ఉద్యమ వారసత్వాన్ని ఈ సదస్సులో జరిగే చర్చలు గుర్తుచేస్తాయన్నారు. గ్లోబల్ సౌత్–గ్లోబల్ నార్త్ వేదిక, కొత్త గ్లోబల్ సౌత్ సంస్థల ఏర్పాటు కూడా ఈ సదస్సులో జరగనుంది.చర్చనీయాంశాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, సాంకేతికత–ఏఐ, భద్రత–బహుపాక్షికత, భారత్–ప్రపంచం అనే ఆరు ఇతివృత్తాల కింద ప్యానెల్ చర్చలు జరుగుతాయి. కొత్త ఆర్థిక ఒప్పందం, వాతావరణ మార్పులు, యువత–రాజకీయాలు, లింగ న్యాయం, ఏఐ–క్లౌడ్ క్యాపిటలిజం, మీడియా భవిష్యత్తు, బహుపాక్షిక సంస్థల సంస్కరణ, ప్రపంచ శాంతి వంటి అంశాలు చర్చకు రానున్నాయి. కాంగ్రెస్ నేతలు శశి థరూర్, గౌరవ్ గొగోయ్, సల్మాన్ ఖుర్షీద్, సచిన్ పైలట్, సుప్రియా శ్రీనేత్, పవన్ ఖేరా తదితరులు పాల్గొంటున్నారు. సదస్సుకు హాజరయ్యేందుకు వచి్చన వివిధ దేశాల ప్రతినిధులకు గురువారం మంత్రులు స్వాగతం పలికారు.


