పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు.. సీఎన్‌జీ ధరల పెరుగుదల కూడా భారంగా మారుతోంది. ఇప్పటికే పుణెలో సీఎన్‌జీ ధరలు పెరగగా, తాజాగా ముంబైతో పాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) పరిధిలోనూ ధరలు పెరిగాయి.
మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) కిలో సీఎన్‌జీపై రూ.1.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కేజీ ధర రూ.91.50కి చేరింది. పెరిగిన ధరలు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి.
ఈ ఏడాది జనవరిలో ముంబైలో కేజీ సీఎన్‌జీ ధర రూ.80.50గా ఉండేది. తాజాగా.. మరోసారి ధర పెరగడంతో కేవలం 11 నెలల కంటే తక్కువ వ్యవధిలోనే కేజీపై రూ.11 పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఎంజీఎల్ ఎనిమిది సార్లు సీఎన్‌జీ ధరలను పెంచింది. అంటే.. దాదాపు 14 శాతం మేర ధరలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటివరకు ఎంజీఎల్ ఎనిమిదిసార్లు సీఎన్‌జీ ధరలను పెంచింది. జనవరిలో రూ.80.50గా ఉన్న ధర.. ఇప్పుడు రూ.91.50కి చేరడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
సీఎన్‌జీ ధరలను పెంచడానికి ప్రధాన కారణం.. గ్యాస్ కొనుగోలు ఖర్చులు పెరగడమే అని ఎంజీఎల్ వెల్లడించింది. అంతే కాకుండా.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, దేశీయంగా గ్యాస్ సరఫరా కేటాయింపులు తగ్గడం వంటి అంశాలు ఖర్చులను పెంచుతున్నాయని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా మారే రీ-గ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (RLNG) వినియోగం పెరగడం వల్ల సీఎన్‌జీ కొనుగోలు ఖర్చులు అధికమవుతున్నాయని వివరించింది.


