ముంబై: ఆర్థిక రాజధాని ముంబైలో వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం వేళ చల్లటి గాలులు, పొగమంచు పలకరిస్తుంటే.. మధ్యాహ్నం ఎండ తీవ్రత కొనసాగుతోంది. రానున్న వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. నవంబర్ 14న గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది.
శాంటాక్రూజ్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 18.9 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే 2.7 డిగ్రీలు తక్కువ. గరిష్ఠ ఉష్ణోగ్రత 35.3 డిగ్రీలుగా నమోదైంది. సముద్రపు గాలులు ముందుగానే ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని వాతావరణ విశ్లేషకుడు రాజేశ్ కపాడియా తెలిపారు. అయితే ఇది పూర్తిస్థాయి శీతాకాలానికి సంకేతం కాదని పేర్కొన్నారు.
మరోవైపు నగరంలో వాయు కాలుష్యం నెలకొంది. శుక్రవారం ఏక్యూఐ 111గా నమోదైంది. కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మరో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ములుంద్, బోరివలి, గోరేగావ్, దహిసర్, ఖార్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న 28 కేంద్రాలకు ఇవి అదనం. రూ.22 కోట్ల వ్యయంతో చేపట్టే వీటి నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదీ చదవండి: లూసియానా గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు!


