విడాకుల తర్వాత పిల్లాడిని కలవడంపై హైకోర్టు కీలక ఆదేశాలు | Karnataka High Court suggests replacing visitation with parenting time | Sakshi
Sakshi News home page

విడాకుల తర్వాత పిల్లాడిని కలవడంపై హైకోర్టు కీలక ఆదేశాలు

Oct 5 2026 5:58 PM | Updated on Oct 5 2026 6:16 PM

Karnataka High Court suggests replacing visitation with parenting time

 ‘విజిటేషన్‌’కు బదులు ‘పేరెంటింగ్‌ టైమ్‌’ అనాలి

బెంగళూరు: కస్టడీకి సంబంధించి న్యాయస్థానాల్లో ఉపయోగించే భాషపై కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కుటుంబ న్యాయస్థానాలు, సంరక్షకులు, వార్డుల చట్టానికి సంబంధించిన కేసులను విచారించే ఇతర న్యాయస్థానాలు పిల్లలను కలిసే తల్లిదండ్రుల సమయాన్ని సూచించేందుకు ‘విజిటేషన్‌’ అనే పదానికి బదులుగా ‘పేరెంటింగ్‌ టైమ్‌’ అనే పదాన్ని ఉపయోగించాలని ఆదేశించింది. పిల్లల జీవితంలో తల్లిదండ్రుల్లో ఎవరూ అతిథి కాదనే భావనను ప్రతిబింబించేలా ఈ మార్పు చేస్తున్నట్లు జస్టిస్‌ లలితా కన్నెగంటి నేతృత్వంలోని సింగిల్‌ బెంచ్‌ పేర్కొంది.

ఓ బాలుడి కస్టడీకి సంబంధించిన కేసును విచారిస్తూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై దాఖలు చేసే పిటిషన్లలో కూడా ‘విజిటేషన్‌’కు బదులుగా ‘పేరెంటింగ్‌ టైమ్‌’ కోరాలని కుటుంబ న్యాయస్థానాలకు పరిపాలనా సూచనలు ఇవ్వాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది. ఈ ఉత్తర్వును అన్ని కుటుంబ న్యాయస్థానాలు, సంరక్షకులు, వార్డుల చట్టం కింద కేసులు విచారించే ఇతర న్యాయస్థానాలకు తెలియజేయాలని సూచించింది.

ఈ కేసులో తల్లిదండ్రులు 2017 నుంచి విడిగా ఉంటున్నారు. బాలుడి వయసు 9 సంవత్సరాలు. అతడికి 3 నెలల వయసు ఉన్నప్పటి నుంచి తండ్రి అతడిని చూడలేదని కోర్టు పేర్కొంది. తల్లిదండ్రుల మధ్య పలు న్యాయపరమైన వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ న్యాయస్థానం ఇప్పటికే విడాకులు మంజూరు చేయగా, తండ్రి దానిని సవాలు చేశారు.

ట్రయల్‌ కోర్టు తండ్రికి ప్రతి శనివారం, ఆదివారం 3 నుంచి 4 గంటల పాటు బాలుడితో గడిపే అవకాశం కల్పించింది. సెలవుల్లో 50 శాతం కాలానికి మధ్యంతర కస్టడీని ఇచ్చింది. అలాగే తల్లికి ముందుగా సమాచారం ఇచ్చి, ఒక రోజు విడిచి మరో రోజు సుమారు 30 నిమిషాల పాటు వాట్సాప్‌ లేదా ఇతర సమాచార సాధనాల ద్వారా కుమారుడితో మాట్లాడే అవకాశం కల్పించింది.

‘విజిటేషన్‌’ అనే పదం ఒక తల్లిదండ్రులు పిల్లల జీవితంలో భాగం కాగా, మరొకరు కేవలం వచ్చి వెళ్లే వ్యక్తి అనే భావన కలిగించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. “పేరెంటింగ్‌ టైమ్‌ అని పిలవడం ద్వారా పిల్లల జీవితంలో ఏ తల్లిదండ్రి కూడా సందర్శకుడు కాదనే సాధారణ సత్యాన్ని గుర్తిస్తున్నాం” అని పేర్కొంది. కస్టడీ నిర్ణయాలు ప్రతి కేసులోని వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగానే ఉండాలని, ఒకే విధమైన సూత్రాన్ని అన్ని కేసులకు వర్తింపజేయలేమని స్పష్టం చేసింది.

తండ్రి చెన్నైలో, తల్లి బెంగళూరులో ఉంటున్న నేపథ్యంలో బాలుడి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత అందేలా చూడాల్సిన బాధ్యత కోర్టుదేనని తెలిపింది. బాలుడిని తల్లి ఇంటి నుంచి తండ్రి తీసుకెళ్లి తిరిగి అప్పగించేందుకు ‘పేరెంటింగ్‌ టైమ్‌’గా అనుమతించింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 15న జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement