breaking news
h1n1 influenza
-
అప్రమత్తతే అత్యంత కీలకం.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర పరిస్థితులు!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ)... గత కొంత కాలంగా వైద్య పరిభాషలో తరచుగా వినియోగిస్తున్న పదాలివి. ఆస్పత్రుల్లో జ్వరం, తీవ్ర శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సీజన్ మార్పు నేపథ్యంలో జ్వరాలు, జలుబు, దగ్గు లక్షణాలు రావడం సహజమే అయినప్పటికీ ప్రస్తుతం వీటి తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటోంది. వైరస్ ప్రభావంతో వస్తున్న ఈ సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైద్యుల సహకారాన్ని తీసుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతం చేసిన క్రమంలో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తోంది. ఈ మేరకు దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. జాగ్రత్తలు తప్పనిసరి... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐఎల్ఐ, ఎస్ఏఆర్ఐ కేసులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రాల వారీగా వచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తే వీటి పెరుగుదల స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు, సంబంధిత శాఖలు, సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించిన అనంతరం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలకు పలు అంశాలపై సూచనలు చేసింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తూ తక్షణ చర్యలను సూచించింది. తాజాగా నమోదవుతున్న జ్వరాలు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు కారణం హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వైరస్ ప్రభావం ఉన్నట్లు అధ్యయనా లు చెబుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో వస్తున్న వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశా లు ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలున్నవారు వెంటనే వైద్యుడి సంరక్షణలో జాగ్రత్తలు పాటించి చికిత్స పొందాలని చెపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైరస్ సోకిన వ్యక్తులతో మెదిలే సమయంలో మాసు్కలు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించడం, చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం లాంటి చర్యలు తప్పకుండా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనలు జారీ చేసింది. కోవిడ్–19 జాగ్రత్తలు మరవద్దు.. దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడిలో ఉన్నా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వ్యాధుల తీరును పరిశీలి స్తే కోవిడ్ కేసుల పెరుగుదలకు అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ అంశాలను తప్పకుండా పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జ్వరాలు, శ్వాస సంబంధిత వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాలని, జాగ్రత్త చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అదేవిధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య పరికరాల పనితీరును సరిచూసుకోవాలని కోరింది. ఆక్సిజన్ వస తులను పునఃసమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని రకాల ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించింది. కాగా, ‘గత కొన్ని నెలలుగా కోవిడ్–19 కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేట్ క్రమంగా పెరుగుతుండటం తక్షణమే పరిష్కరించాల్సిన అంశం’అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులు తక్కువగానే ఉంటున్నా, కోవిడ్ కట్టడికి ఐదంచెల వ్యూహం అమలుపై అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. ఇన్‌ఫ్లూయెంజా ఏటా సీజనల్‌గా వ్యాప్తి చెందేదే అయినప్పటికీ ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, ఎక్కువ మంది జనం ఒకే చోట గుమికూడటం వంటి కారణాలతో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వంటి కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. -
హైదరాబాద్ పై స్వైన్‌ఫ్లూ పంజా
* ఒక్కరోజే ముగ్గురు మృతి, మరొకరి పరిస్థితి విషమం * ఈ ఏడాదిలో 25 మందికి సోకిన ప్రాణాంతక వైరస్ * నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం * భయాందోళనలో నగరవాసులు సాక్షి, హైదరాబాద్: నగరంపై స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. ప్రమాదకరమైన వైరస్ బారినపడి బుధవారం ఒక్కరోజే ముగ్గురు మరణించారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్(47) ఆదిత్య ఆస్పత్రిలో, జీడిమెట్లకు చెందిన గర్భిణి కవిత(25) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన దేవరాజ్(45)ను ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి గాంధీకి తరలిస్తుండగా ఆయన చనిపోయారు. మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్వాన్కు చెందిన మహేశ్వరి(25) పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు హైదరాబాద్‌లో 25 మందికి స్వైన్ ఫ్లూ సోకగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో నగరవాసుల్లో భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రుల్లో నిత్యం స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. రాష్ర్టంలోని ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులు కూడా నగరానికే వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన ఈ వైరస్(హెచ్1ఎన్1 ఇన్‌ప్లుయాంజా) సాధారణంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య చురుగ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా ఇది విజృంభిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వాతావరణంలో ప్రవేశించిన తర్వాత రెండుమూడు గంటలకు మించి ఈ వైరస్ బతకదు, అయితే ప్రస్తుతమున్న ప్రతికూల పరిస్థితుల వల్ల ఇది బలపడుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద ఘంటికలు ఈ వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. బాధితులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి, పూర్తిగా నయమయ్యాకే బయటకు పంపాలి. కానీ వైరస్ సోకిన వారు ఆస్పత్రుల నుంచి తమకుతాముగా వెళ్లిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అలా వెళ్లిన వారితో ఆ వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది. ఖైరతాబాద్ మక్తాలో స్వైన్‌ఫ్లూ సోకిన ఓ వ్యక్తి(40) గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులపాటు చికిత్స తీసుకున్నాడు. ఆసుపత్రి నచ్చలేదంటూ మంగళవారం వెళ్లిపోయాడు. అలాగే ఈ నెల ఒకటిన అనుమానిత వైరస్‌తో శ్రీనగర్‌కాలనీకి చెందిన వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించడంతో నమూనాలను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపి పరీక్షించారు. ఎబోలా కాదని తేలినా అది ఏ రకమైన వైరస్ అన్నది మాత్రం నిర్ధారణ కాలేదు. అయితే వైద్య సేవలు సరిగాలేవని ఆ వ్యక్తి ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి వారి వల్ల ఇతరులకు ముప్పు పొంచి ఉంది. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఉదంతాలే నిదర్శనం. వైరస్ సోకిన వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి, కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన పర్యవేక్షణ బృందం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆరోగ్య శాఖ డెరైక్టర్ నేతృత్వంలో జిల్లాకో బృందం ఉన్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కాగా, రోగి వెళ్లిపోతానంటే అడ్డుకోలేమని గాంధీ వైద్యాధికారులు అంటున్నారు. అలా వెళ్లిపోయిన వారి వివరాలను ఆరోగ్య శాఖ డెరైక్టర్‌కు అందిస్తామని, వారి ఆధ్వర్యంలోని పర్యవేక్షణ బృందాలే తదుపరి చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. క్షణాల్లో వ్యాపించే స్వైన్‌ప్లూ వంటి ప్రమాదకరమైన వైరస్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని గాంధీ వైద్యులే వ్యాఖ్యానిస్తున్నారు.