హాస్పిటల్‌లో ట్విస్ట్‌.. ఖాన్‌ సాబ్‌కు ఇదేం శిక్ష? | Imran Khan Shifted Back To Adiala Jail After Medical Check-Up At Shifa Hospital, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

హాస్పిటల్‌లో ట్విస్ట్‌.. ఖాన్‌ సాబ్‌కు ఇదేం శిక్ష?

Aug 21 2026 11:21 AM | Updated on Aug 21 2026 11:52 AM

ś Twist: Medical Check up and Back to Jail

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో.. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. చికిత్స కోసం ఆయన్ని ఇస్లామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించింది తెలిసిందే. అయితే ఈ ఉదయం మళ్లీ ఆయన్ని అడియాలా జైలుకు తరలించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పీటీఐ వర్గాలు తీవ్ర  ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం జైల్లో అందిస్తున్న సదుపాయాలు.. చికిత్సపై అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు వెలువడ్డ రెండ్రోజుల తర్వాతే ఆయన్ని.. గత అర్ధరాత్రి రావల్పిండి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఇస్లామాబాద్‌లో ఉన్న షిఫా ఆస్పత్రికి అ‍త్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించారు. 

ఈ పరిణామంపై పీటీఐ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఆయన్ని నిజంగానే తరలించారా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆస్పత్రి వర్గాలు ఆయన చేరికను ధృవీకరించాయి. కోర్టు ఆదేశాల ప్రకారం.. తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్‌ 16వ తేదీ దాకా ఆయన్ని ఆస్పత్రిలోనే ఉంచుతారని అంతా భావించారు. కానీ.. ఈలోపే ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

శుక్రవారం ఉదయం.. షిఫా ఆస్పత్రిలో ఆరుగురు నిపుణుల వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు. దీంతో ఆయన జైల్లో ఉండడమే సురక్షితమని భావించి అధికారులు.. తిరిగి అడియాలాకు తీసుకొచ్చారు. 

కంటి సమస్య.. అంతా ఓకే అంటున్న ప్రభుత్వం
ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయనకు కుడి కంటి సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రక్తనాళాల్లో సమస్య (సెంట్రల్‌ రెటినల్‌ వీన్‌ ఆక్లూజన్‌) కారణంగా ఆయనకు చికిత్స అవసరమని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు చెబుతున్నారు. జైలులో సరైన వైద్యం అందడం లేదని ఇమ్రాన్‌ కుటుంబం ఆరోపిస్తుండగా.. అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పాక్‌ ప్రభుత్వం చెబుతోంది.

రివ్యూ పిటిషన్‌.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు రిజిస్ట్రార్‌ కార్యాలయం అభ్యంతరాలతో తిరిగి పంపింది. అభ్యంతరాలను సరిచేసి మళ్లీ దాఖలు చేసే అవకాశం ఉంది.

జైలు నుంచే రాజకీయ పోరాటం
2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ జైలులోనే ఉన్నారు. తనపై నమోదైన కేసులు రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. 2018లో పాకిస్థాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్‌.. 2022లో అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయారు. ఆ తర్వాత ఆయనకు, పాక్‌ సైన్యానికి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ప్రస్తుతం జైలు నుంచే తన విడుదల కోసం ఇమ్రాన్‌, తమ అధినేత కోసం పీటీఐ నేతలు పోరాడుతున్నారు. మెరుగైన వైద్యం, కేసుల వేగవంతమైన విచారణ, విడుదల కోసం పీటీఐ దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement