ఇషాన్ కిషన్- తిలక్ వర్మ (PC: BCCI Domestic X)
దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్ క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ జట్టు మూడోసారి సొంతం చేసుకుంది. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరోసారి చాంపియన్‌గా అవతరించింది.
కెప్టెన్‌గా, ఆటగాడిగా ఈ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. సౌత్ జోన్ సారథిగా వ్యవహరించిన తిలక్ వర్మ బ్యాటర్‌గా రాణించినప్పటికీ.. కెప్టెన్‌గా మాత్రం చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.
𝙏𝙝𝙖𝙩 𝙒𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙁𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🏆
Congratulations to the Ishan Kishan-led East Zone on winning their third #DuleepTrophy title 👏👏#EZvSZ | @ishankishan51 pic.twitter.com/u6D4UvOTEp— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్ ఆదివారం మొదలైంది. టాస్ గెలిచి తొలి రెండురోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ జట్టు.. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఇషాన్ డబుల్ సెంచరీ
టాపార్డర్‌లో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44).. వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) అదరగొట్టారు. మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (270)తో కదం తొక్కాడు. మరోవైపు.. కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101).. అనుకుల్ రాయ్ (45), ఎండీ కౌనియన్ ఖురేషి (40) రాణించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ తిలక్ వర్మ 99 పరుగులు చేయగా.. దేవదత్ పడిక్కల్ 62 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో సీవీ మిలింద్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, ఎండీ కౌనియన్ ఖురేషి, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో సౌత్ జోన్ 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఫాలో ఆన్ ఆడించకుండా..
ఆ తర్వాత సౌత్‌కు ‘ఫాలోఆన్’ ఇవ్వకుండా ఈస్ట్ బుధవారమే బ్యాటింగ్‌కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (8), ఈశ్వరన్ (3) విఫలమైనా...ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.
ఇషాన్ 80 పరుగులు చేయగా.. శిఖర్ మోహన్ 52 పరుగులతో రాణించాడు. ఇక ఆఖరిదైన గురువారం నాటి ఐదో రోజు ఆటలో ఆల్‌రౌండర్ ఖురేషి అజేయ శతకం (116)తో రాణించగా.. అనుకుల్ రాయ్ హాఫ్ సెంచరీ (64) సాధించాడు. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా 46 పరుగులు చేశాడు.
మ్యాచ్ డ్రా.. ఈస్ట్‌దే టైటిల్
ఈ క్రమంలో 388 పరుగుల వద్ద ఏడు వికెట్ల నష్టానికి ఈస్ట్ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా మొత్తంగా 760 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. దీంతో ఆఖరి రోజు ఆట కాబట్టి సౌత్ జోన్ ‘డ్రా’కు అంగీకరించింది. నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లోనూ ఈస్ట్ ఆధిక్యంలో ఉన్నందున ట్రోఫీ ఈస్ట్ జోన్‌కే దక్కింది. ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
Handshakes in the middle to conclude a fantastic Final 🤝
East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026


