ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటములను చవిచూసిన పాక్ జట్టు.. ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ అదే దిశగా పయనిస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాక్ జట్టు ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 133 పరుగులకే కుప్పకూలింది.
కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు సీనియర్ ఆటగాళ్లు అబ్ధుల్లా షఫీక్, షాన్ మసూద్ కూడా విఫలమయ్యారు. కొత్తగా జట్టులోకి వచ్చిన అజాన్ అవైస్, ఘాజీ ఘోరీ వంటి యువ ఆటగాళ్లు సైతం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కాగా తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటమి చవిచూడడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
ఆటగాళ్లతో పాటు కోచ్‌లు సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్‌ను ఉన్నపళంగా స్వదేశానికి రప్పించి పీసీబీ అవమానపరిచింది. వారి స్ధానంలో ఆఖరి టెస్టు కోసం వైట్ బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌తో పాటు ఆష్లే నాఫ్కేలను ఇంగ్లండ్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పంపించింది. ఈ సాహసోపేతమైన నిర్ణయం కూడా బెడిసికొట్టిందే అని చెప్పాలి.
పాక్ జట్టు ఆట తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. అదే తడబాటు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మైక్ హెస్సన్‌పై పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హెస్సన్ ఇక ఇండియన్ ఏజెంట్ అని అతడు పరోక్షంగా ఆరోపించాడు. పాక్ క్రికెట్ పతనానికి అతడే కారణమని లతీఫ్ విమర్శించాడు.
"విదేశీ కోచ్‌ల విషయంలో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. బాబ్ వూల్మర్ నుంచి మిక్కీ ఆర్థర్ వరకు ఎంతో విధేయతతో పాక్ క్రికెట్‌కు తమ సేవలను అందించారు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. కానీ ఐపీఎల్‌లో పనిచేసి మన బ్యాక్‌రూమ్ స్టాఫ్‌లో చేరిన ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ అనుమానం ఉంటుంది. మనం భారత్‌ను అడ్డుకోవాలని చూస్తుంటే, వారు లోపల నుంచి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే భావన నాకు ఎప్పుడూ కలుగుతోంది.
నేను అనవసరంగా ఎవరిపైన నిందలు వేయాలనుకోవడం లేదు. అయితే ఎవరినైనా కోచ్‌లగా నియమించుకునే ముందు వారి బ్యాక్ గ్రౌండ్ ను సరిగ్గా పరిశీలించాలి. వారికి భారత్‌తో ఏదో ఒక సంబంధం ఉండి ఉండవచ్చు. మనం భారత క్రికెట్‌కు ఎలాంటి హానీ చేయలేదు.
కానీ ఐపీఎల్ నుంచి వచ్చి ఎవరైనా మన క్రికెట్‌ను నాశనం చేసే అవకాశం ఉంది. ఈ విధంగానే కోచ్‌లు లేదా ఇతర సభ్యులు ఏజెంట్లుగా మారతారు. గతంలో పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్లు, కోచ్‌లు కూడా మన వ్యవస్థలోకి చొరబడ్డారని" లతీఫ్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
కాగా న్యూజిలాండ్‌కు చెందిన మైఖేల్ హెస్సన్ గతంలో ఆర్సీబీ జట్టుకు 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్'గా సుదీర్ఘకాలం పనిచేశారు. విరాట్ కోహ్లి వంటి దిగ్గజ క్రికెటర్‌కు అతడితో మంచి అనుబంధం ఉంది.
చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు


