Photo Credit: Twitter
మహిళల ఆసియా కప్ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. రికార్డుస్థాయిలో ఇప్పటివరకు ఏడుసార్లు ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఎనిమిదోసారి టైటిల్‌ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
ఓపెనర్ షెఫాలీ వర్మ (168 పరుగులు, రెండు ఫిఫ్టీలు) భీకర ఫామ్‌లో ఉండగా, ఓపెనర్ స్మృతి మంధాన (154 పరుగులు) కూడా మంచి ఫామ్‌లో ఉంది. ఆమె ఖాతాలో ఒక సెంచరీ కూడా ఉండడం విశేషం. అయితే వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడం జట్టుకు మైనస్ అని చెప్పొచ్చు.
ఇక బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (11 వికెట్లు) లంక కెప్టెన్ చమేరీ ఆటపట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతండగా, తెలుగుతేజం శ్రీచరణి కూడా 8 వికెట్లతో సూపర్ ఫామ్‌లో ఉంది. ఈ నలుగురికి తోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ప్రేమ రావత్ కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు.
మరోవైపు లంక బ్యాటింగ్‌లో హర్షితా సమరవిక్రమ (4 ఇన్నింగ్స్‌లు కలిపి 89 పరుగులు), నిలక్షిక సిల్వ (4 ఇన్నింగ్స్‌లో 86 పరుగులు)తో పాటు కవిషా దిల్హరీ కీలకం కానున్నారు. పాక్‌తో సెమీస్‌లో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లంక ఫైనల్‌కు చేరడం కష్టమే అనిపించింది. ఈ దశలో హర్షితా, కవిషా, నిలక్షికలు సాధికారిక బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు.
2024 సీజన్ మహిళల ఆసియా కప్‌ను శ్రీలంక కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆనాటి ఫైనల్లో భారత జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన శ్రీలంక టైటిల్‌ను అందుకుంది. భారత్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ చమేరీ ఆటపట్టు (61), హర్షిత సమరవిక్రమ (69 నాటౌట్) 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించారు.
ఈసారి ఫైనల్ కూడా శ్రీలంకతో జరగనున్న నేపథ్యంలో హర్మన్‌సేన 2024 నాటి ఫైనల్‌కు బదులు తీర్చుకోవడంతో పాటు ఎనిమిదోసారి ఆసియాకప్‌ను కైవసం చూసుకుంటుందేమో చూడాలి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఇప్పటివరకు 29 సార్లు తలపడితే.. ఇందులో 23 సార్లు భారత్ గెలిస్తే, ఐదుసార్లు లంక విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్ ఫలితం రాలేదు.
Read: అల్కరాజ్‌ను ఓడించినోడు ఫైనల్‌కు; 23 ఏళ్ల రికార్డు బద్దలయ్యేనా?


