సౌదీలో ఆయిల్‌ పైప్‌లైన్‌ టార్గెట్‌.. పెరుగుతున్న టెన్షన్‌ | Saudi Oil Pipeline Attack Global Oil Supply Concerns | Sakshi
Sakshi News home page

సౌదీలో ఆయిల్‌ పైప్‌లైన్‌ టార్గెట్‌.. పెరుగుతున్న టెన్షన్‌

Sep 12 2026 4:42 AM | Updated on Sep 12 2026 4:42 AM

Saudi Oil Pipeline Attack Global Oil Supply Concerns

అంతర్జాతీయం: సౌదీ అరేబియాలోని కీలక చమురు పైప్‌లైన్‌ వ్యవస్థపై గురువారం రోజున దాడి జరిగింది. పైప్‌లైన్‌కు సమీపంలోని పంపింగ్‌ స్టేషన్లను ప్రాజెక్టైల్స్‌తో లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వర్గాల సమాచారం. దీంతో దాడి దాడి విషయంలో ముందుజాగ్రత్త చర్యగా పైప్‌లైన్‌ కార్యకలాపాలను సౌదీ అరేబియా నిలిపివేసింది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పైప్‌లైన్‌ భద్రతను పరిశీలించడంతోపాటు నష్టాన్ని అంచనా వేసే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి.

అలాగే, దాడి ప్రభావం శాటిలైట్‌ చిత్రాల్లోనూ కనిపించింది. ఓ పంపింగ్‌ స్టేషన్‌ వద్ద భారీగా మంటలు చెలరేగిన ఆనవాళ్లు కనిపించగా.. మరో స్టేషన్‌ వద్ద గురువారం దట్టమైన నల్ల పొగలు వెలువడ్డాయి. అయితే పైప్‌లైన్‌ ప్రధాన భాగానికి ఎంతమేర నష్టం జరిగిందనే విషయంపై స్పష్టత లేదు.  పంపింగ్‌ స్టేషన్లకు మాత్రమే నష్టం జరిగితే మరమ్మతులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారులు, నిపుణులు భావిస్తున్నారు. దాడికి పాల్పడింది ఎవరన్నదానిపై స్పష్టత రాలేదు
అయితే ఇరాక్‌ నుంచి వచ్చిన డ్రోన్లతో దాడి జరిగి ఉండొచ్చని అమెరికా వర్గాల అంచనా. గతంలో ఇరాన్‌కు అనుకూలంగా ఉండే ఇరాక్‌ మిలీషియా గ్రూపులు సౌదీ అరేబియాపై డ్రోన్లతో దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుత దాడి కూడా అలాంటదే అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన నిఘా సమాచారాన్ని అమెరికా అధికారులు సేకరిస్తున్నారు.

అమెరికా–ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో సౌదీ చమురు మౌలిక వసతులపై జరిగిన ఈ దాడి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌ హోర్ముజ్‌ జలసంధి మార్గాన్ని ఇంచుమించుగా మూసివేయడంతో.. పెర్షియన్‌ గల్ఫ్‌ నుంచి నౌకల ద్వారా ఎగుమతి కావాల్సిన సౌదీ చమురులో రోజుకు సుమారు 50 లక్షల బ్యారెళ్లను ఈస్ట్‌–వెస్ట్‌ పైప్‌లైన్‌తో ఎర్ర సముద్రంలోని యాన్‌బు పోర్టుకు తరలిస్తున్నారు. దీంతో సౌదీ చమురు ఎగుమతులకు ఈ పైప్‌లైన్‌ కీలక మార్గంగా మారింది. మరోవైపు హౌతీ యోధులు సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిస్తుండటంతో ఎర్ర సముద్రం మార్గంపైనా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

పైప్‌లైన్‌ కార్యకలాపాలు ఎప్పటికి తిరిగి ఎప్పుడు మొదలవుతుందనేది ప్రస్తుతానికి తెలియరాలేదు. ఇదే సమయంలో సౌదీ అరేబియా ముడి చమురు ఉత్పత్తి గత నెలలో 1990 తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు ఒపెక్‌కు సమాచారం అందింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఇప్పటికే బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. ఈ పరిస్థితుల్లో సౌదీ చమురు రవాణా వ్యవస్థపై దాడి జరగడం ప్రపంచ చమురు సరఫరాపై మరింత ఆందోళనకు దారితీస్తోంది.

ఇవి కూడా చదవండి: ఇజ్రాయెల్‌పై యుద్ధంలో ఇరాన్‌కు బిగ్‌ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement