హ్యారీ బ్రూక్ (PC: ECB X)
శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం సాధించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కేవలం 49 బంతుల్లోనే 114 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.
119 పరుగుల తేడాతో ఘన విజయం
బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా లంకతో తొలి టీ20లో ఇంగ్లండ్ ఏకంగా 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక లంకతో తొలి టీ20 సందర్భంగా సెంచరీతో చెలరేగిన బ్రూక్.. సరికొత్త చరిత్ర సృష్టించాడు.
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక శతకాలు బాదిన ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టు కెప్టెన్‌గా బ్రూక్ ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా 2025లో జోస్ బట్లర్ నుంచి ఇంగ్లండ్ వైట్‌బాల్ సారథిగా పగ్గాలు అందుకున్నాడు బ్రూక్.
ప్రపంచ రికార్డు
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా తొలిసారి కెప్టెన్ హోదాలో పాకిస్తాన్ (ఫిబ్రవరి 24, 2026)పై శతక్కొట్టిన బ్రూక్.. తాజాగా శ్రీలంక (సెప్టెంబరు 15, 2026)పై సెంచరీ సాధించాడు. తద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా రెండు టీ20 శతకాలు బాదిన ఫుల్ మెంబర్ జట్టు సారథిగా బ్రూక్ నిలిచాడు.
అతడికి అగ్రస్థానం
ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా ఈ జాబితాలో అసోసియేట్ జట్టు ఎస్వతిని కెప్టెన్ ఆదిల్ బట్ మూడు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2026లో అతడు మొజాంబిక్, లెసొతో (రెండుసార్లు) జట్లపై సెంచరీలు సాధించాడు.
శ్రీలంక ఇంగ్లండ్ పర్యటన
ఇంగ్లండ్‌తో మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు శ్రీలంక జట్టు అక్కడికి వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య సౌతాంప్టన్‌లో మంగళవారం తొలి టీ20 జరిగింది. ది రోజ్ బౌల్ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
బట్లర్, బ్రూక్ తుపాన్ ఇన్నింగ్స్
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 254 పరుగులు స్కోరు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (44 బంతుల్లో 80), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (49 బంతుల్లో 114 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. 19 ఓవర్లలో కేవలం 135 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోనీ బేకర్ మూడు వికెట్లు తీయగా.. లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్ చెరో రెండు.. జోష్ టంగ్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీ.. సంజూ స్పందన
Simply sensational from Harry Brook 🔥
Watch all of his boundaries this evening ⤵️ pic.twitter.com/SuOIAwKFiv— England Cricket (@englandcricket) September 15, 2026


