సంజూ- వైభవ్ (PC: BCCI X)
అఫ్గానిస్తాన్‌తో రెండు టీ20 మ్యాచ్‌లలో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్, ఓపెనర్ సంజూ శాంసన్ రాక కారణంగా ఈ పదిహేనేళ్ల పిల్లాడికి తుదిజట్టులో చోటు దక్కడం లేదు. దీంతో వైభవ్ జట్టుకు వాటర్ బాయ్‌గా సేవలు అందిస్తున్నాడు.
సిరీస్ టీమిండియా కైవసం
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా అఫ్గాన్ బోర్డు ఢిల్లీ వేదికగా టీమిండియాకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం నాటి తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. మంగళవారం జరిగిన రెండో టీ20లోనూ ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ కంటే ముందు భారత టీ20 జట్టు జింబాబ్వేలో పర్యటించింది.
జింబాబ్వేలో ధనాధన్
ఇందులో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడగా.. వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి 151 పరుగులు సాధించి.. జట్టు క్లీన్‌స్వీప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.
అయితే, జింబాబ్వేతో సిరీస్‌కు దూరమైన వరల్డ్‌కప్ వీరుడు సంజూ శాంసన్ అఫ్గాన్‌తో సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. దీంతో వైభవ్‌పై వేటు పడింది. అయితే ,తొలి టీ20లో సంజూ 10 పరుగులే చేసి అవుటయ్యాడు. దీంతో వైభవ్‌ను కాకుండా సంజూను ఆడించి తప్పుచేశారనే విమర్శలు వచ్చాయి.
మావాడు సిద్ధంగానే ఉన్నాడు.. కానీ
ఈ నేపథ్యంలో అఫ్గాన్‌తో టీమిండియా రెండో టీ20కి ముందు స్టేడియానికి వచ్చిన వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీని స్పోర్ట్స్‌తక్ పలకరించింది. వైభవ్‌కు తుదిజట్టులో చోటు దక్కడం లేదు.. రెండో మ్యాచ్‌లోనైనా అవకాశం వస్తుందనుకుంటున్నారా? అని ప్రశ్నించింది.
ఇందుకు బదులిస్తూ.. ‘‘మీ అందరి ఆశీర్వాదాలు వైభవ్‌పై ఉండాలి. మాకు అదే పదివేలు. జట్టుకు అవసరమైన వేళ అతడు సిద్ధంగా ఉంటాడు. నా కుమారుడు ఇప్పటికీ పూర్తిస్థాయి ప్రదర్శన ఇచ్చేందుకు సన్నద్ధంగానే ఉన్నాడు. ఏదేమైనా జట్టు గెలవడం ముఖ్యం. మాకు అదిచాలు’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.
కాగా రెండో టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరిమితం కాగా.. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా సంజూ బరిలోకి దిగాడు. కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా విమర్శలకు చెక్ పెట్టాడు. అయితే, నామమాత్రపు మూడో టీ20లో మాత్రం మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వైభవ్‌ను ఆడిస్తామని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంకేతాలు ఇచ్చాడు.
చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీ.. స్పందించిన సంజూ


