నేడు అఫ్గానిస్తాన్‌తో భారత్ ఆఖరి టి20
ఇప్పటికే 2–0తో సిరీస్ నెగ్గిన టీమిండియా
రాత్రి గం. 7:30 నుంచి సోనీ స్పోర్ట్స్ చానెల్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌పై వరుస మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి... సిరీస్ పట్టేసిన టీమిండియా చివరి మ్యాచ్‌లో రిజర్వ్ బలాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టి20ల్లో గెలిచిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. గురువారం ఇరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో చివరి టి20 మ్యాచ్ జరగనుంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచి లక్ష్యఛేదనకు మొగ్గుచూపిన టీమిండియా... ఈసారి అవకాశం వస్తే మొదట బ్యాటింగ్ చేస్తూ తమ బలాన్ని సరిచూసుకోవాలని భావిస్తోంది.
అలాగే రిజర్వ్ ప్లేయర్లను ఈ మ్యాచ్‌లో పరీక్షించే అవకాశాలున్నాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు ఎంత పోరాడినా గత రెండు మ్యాచ్‌ల్లో టీమిండియాకు సరైన పోటీనివ్వలేకపోయింది. ముగ్గురు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నా... వారి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రెండో టి20లో రషీద్ ఖాన్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకోవడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌తో పాటు గుర్బాజ్, సాధిఖుల్లా, నైబ్, డార్విష్, అజ్మతుల్లా, నబీ కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరముంది. గత రెండు మ్యాచ్‌ల మాదిరిగానే పిచ్ బ్యాటింగ్‌కు సహకరించనుంది. ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశలు పెద్దగా లేవు.
భిన్నమైన కూర్పుతో...
ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా చూడాలి. రెండో మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ... చివరి పోరులో భిన్నమైన కూర్పును ప్రయత్నిస్తామని వెల్లడించాడు. ఏషియన్ గేమ్స్ ప్రారంభానికి ముందు ప్లేయర్లందరికీ తగినంత మ్యాచ్ టైమ్ దక్కాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్ చెరో మ్యాచ్‌లో హాఫ్‌సెంచరీలు బాదిన నేపథ్యంలో ఎవరి స్థానంలో సూర్యవంశీని తీసుకుంటారనేది ఆసక్తికరం. ఇంగ్లండ్, జింబాబ్వేలో అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్... సొంతగడ్డపై ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. ఇటీవలి కాలంలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న ఇషాన్‌కు విశ్రాంతినిస్తారా చూడాలి.
బౌలర్లకు మరింత వెసులుబాటు కల్పించేందుకు అదనపు బౌలర్‌ను పరీక్షించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అదే జరిగితే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓ ప్లేయర్ తగ్గనున్నాడు. దీంతో పేస్ ఆల్‌రౌండర్, ఆంధ్ర ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌పై బ్యాటింగ్ భారం పెరగనుంది. బౌలింగ్‌లో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతుండగా... అర్ష్ దీప్ సింగ్ అతడికి అండగా నిలుస్తున్నాడు. ముగ్గురు పేసర్‌లతో బరిలోకి దిగాలనుకుంటే యశ్ ఠాకూర్‌కు మరోసారి అవకాశం దక్కొచ్చు. గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్‌కు దూరం కాగా... అతడి స్థానంలో అవకాశం దక్కించుకున్న రవి బిష్ణోయ్ రెండో మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా... ఫీల్డింగ్‌లో మాత్రం టీమిండియా మరింత మెరుగవ్వాల్సిన అవసరముంది.
భారత జట్టుతో జపాన్ రాయబారి భేటీ
ఈనెల 22న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో జపాన్ జట్టుతో భారత జట్టు తొలిసారి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత్‌లో జపాన్ రాయబారి ఒనో కెచీ బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌తో పాటు భారత క్రికెటర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌కు జపాన్‌లో అదృష్ట చిహ్నానికి ప్రతీకగా భావించే ‘దారుమా’ బొమ్మను ప్రదానం చేశారు.
తుది జట్లు (అంచనా)
భారత్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, ఇషాన్/వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, అక్షర్, నితీశ్ రెడ్డి, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అర్ష్ దీప్, బుమ్రా.
అఫ్గానిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), గుర్బాజ్, సాధిఖుల్లా, నైబ్, డారి్వష్, అజ్మతుల్లా, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్/నవీన్, ఫజల్‌హక్ ఫారూఖి.


