ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. ఇరాన్‌ కీలక ప్రకటన | Israeli Strikes Lebanon: Iran says peace talks would be unreasonable | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. ఇరాన్‌ కీలక ప్రకటన

Apr 9 2026 8:36 AM | Updated on Apr 9 2026 10:44 AM

Israeli Strikes Lebanon: Iran says peace talks would be unreasonable

పశ్చిమాసియాలో పట్టుమని ఒక్క గంట కూడా శాంతి పరిస్థితులు నెలకొనలేదు. ఇరాన్‌, అమెరికాలు యుద్ధ విరమణ, శాంతి చర్చలకు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ.. హెజ్బొల్లా పేరు చెప్పి లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులకు పాల్పడుతోంది. కేవలం 10 నిమిషాల్లో 100 బాంబులు ప్రయోగించి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు కలగజేసింది. 

లెబనాన్‌పై దాడులను ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సమర్థించుకున్నారు. రెండు వారాల కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదని.. అది జలసంధిలో భాగం కాదని.. హెజ్బోల్లాపై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.  ఈ నేపథ్యంలో ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి చర్చలు అసంబద్ధం అని పేర్కొంది. 

ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌, శాంతి చర్చల ప్రతినిధి మొహమ్మద్‌ బాగర్‌ ఖలీబాఫ్‌ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నంతవరకు అమెరికాతో శాంతి చర్చలు జరపడం అసాధ్యమని, ఈ చర్చలే అసంబద్ధమని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌(పాకిస్తాన్‌) వేదికగా శాంతి చర్చలు జరగనున్నాయి. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నేతృత్వంలోని బృందం ఈ చర్చలను ముందుకు నడిపించనుంది.

ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై ఇప్పటివరకు జరిగిన అత్యంత భారీ వైమానిక దాడులు జరపగా.. 254 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క బీరుట్‌లోనే 91 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. ప్రతికారంగా.. హెజ్బోల్లా కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇజ్రాయెల్‌–లెబనాన్‌ ఘర్షణలు మధ్యప్రాచ్యంలో(Middle East) శాంతి ప్రయత్నాలను మరింత క్లిష్టం చేస్తున్నాయని పలువురు ప్రపంచ అధినేతలు అభిప్రాయపడుతున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రోన్‌ లెబనాన్‌పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. యూరప్‌, జపాన్‌, కెనడా నాయకులు సంయుక్త ప్రకటనలో శాంతి కోసం పిలుపునిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement