శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని అధికార పార్టీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నాయకత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 19 మంది ఎమ్మెల్యేలు ఒక్కటై పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. కేబినెట్‌లో భారీ మార్పులు చేయాలని, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఇద్దరు నేతలను కీలక బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం సిద్ధం చేశారు. ఈ పరిణామం నేషనల్ కాన్ఫరెన్స్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
19 మంది ఎమ్మెల్యేల కీలక భేటీ
శుక్రవారం సాయంత్రం శ్రీనగర్‌లో ఎమ్మెల్యే ఖైసర్ జంషెడ్ లోన్ నివాసంలో అసంతృప్త ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ భేటీలో కేబినెట్ కూర్పు, పార్టీ వ్యవహారాల్లో జోక్యం, పరిపాలనా నిర్ణయాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి కశ్మీర్ లోయతో పాటు జమ్మూ ప్రాంతానికి చెందిన మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తమ డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు అందించాలని నిర్ణయించారు.
కేబినెట్‌లో సమూల మార్పులకు డిమాండ్
కేబినెట్‌లో రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మంత్రులందరినీ తప్పించి, ప్రతిభ, ప్రాంతీయ సమతుల్యత ఆధారంగా కొత్తగా మంత్రి పదవులను కేటాయించాలని అసమ్మతి ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సన్నిహితులుగా ఉన్న నాసిర్ అస్లాం వనీ, ఎంపీ షమ్మీ ఒబెరాయ్‌లను పార్టీ, పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలతో బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
మంత్రి పదవులు దక్కక అసంతృప్తి
అక్టోబర్ 27న ఒమర్ అబ్దుల్లా కేబినెట్‌ను విస్తరించి నలుగురికి చోటు కల్పించారు. అలీ మహమ్మద్ సాగర్, షమీమా ఫిర్దౌస్, మీర్ సైఫుల్లా, అల్తాఫ్ కల్లూలను మంత్రులుగా తీసుకున్నారు. అయితే సీనియర్లుగా ఉన్నప్పటికీ తమకు అవకాశం దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేబినెట్ ప్రక్షాళన డిమాండ్ తెరపైకి వచ్చింది. మరోవైపు సీనియర్ నేత ముబారక్ గుల్‌ను ఇటీవలే అప్పగించిన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో పార్టీ సంస్థాగత పదవిని చేపట్టేందుకు కూడా ఆయన నిరాకరించినట్లు సమాచారం. తాజా పరిణామాలు పార్టీలో అసమ్మతి ఏ స్థాయికి చేరిందో వెల్లడిస్తున్నాయి.
సీఎం కుర్చీకే ఎసరు..
ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 46. ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్‌కు 41 మంది, కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు కలిపి అధికార కూటమి బలం 47గా ఉంది. అంటే మెజార్టీకి అవసరమైన సంఖ్య కంటే కేవలం ఒక్క సీటు మాత్రమే అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ వారంతా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే, కాంగ్రెస్ మద్దతు కొనసాగినప్పటికీ కూటమి బలం 28కు పడిపోతుంది. అయితే ప్రస్తుతం వారు కేబినెట్ ప్రక్షాళన, పార్టీ వ్యవహారాలపై మాత్రమే డిమాండ్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడికాలేదు. మొత్తంగా 19 మంది ఎమ్మెల్యేలు ఏకమై కేబినెట్ ప్రక్షాళనకు పట్టుబట్టడం నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వానికి సవాలుగా మారింది. పార్టీ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా ఈ అసమ్మతిని ఎలా చక్కదిద్దుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యల కలకలం..
మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, సీఎం ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా ఇటీవల పాకిస్తాన్‌పై చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా దుమారం రేపాయి. బారాముల్లాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ తమను కాపాడుతోందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ ఫరూఖ్ అబ్దుల్లా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఒకవైపు పాకిస్తాన్‌పై ఫరూఖ్ వ్యాఖ్యలతో రాజకీయ వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు సొంత పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపించడం నేషనల్ కాన్ఫరెన్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: తమిళనాట సంచలనం.. నిరుద్యోగులకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్


