పాక్‌ వల్లే ‘కశ్మీర్‌’ సజీవం | Farooq Abdullah Remarks on Pakistan and Kashmir Spark Political Row | Sakshi
Sakshi News home page

పాక్‌ వల్లే ‘కశ్మీర్‌’ సజీవం

Oct 25 2026 5:18 AM | Updated on Oct 25 2026 5:18 AM

Farooq Abdullah Remarks on Pakistan and Kashmir Spark Political Row

ఫరూఖ్‌ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వంపై ఆశలేవీ లేవు 

భారతీయులం కాదని ఎన్నడూ అనలేదు 

కశ్మీర్‌ భారత్‌లో కలిసిపోయిందనే చెప్పాం 

అధికారం కోసం మత విద్వేషాలు ఊహించలేదని వెల్లడి

శ్రీనగర్‌: పొరుగుదేశం పాకిస్తాన్‌ తరచూ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూండటం వల్లనే కశ్మీర్‌ సమస్య ఇప్పటికీ సజీవంగా ఉందని జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశం జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి న్యాయం చేయడం లేదని ఆరోపించారు. అందుకే కశ్మీరీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆశలూ లేవని విమర్శించారు. 

‘‘ఢిల్లీపై మీరు (జమ్మూ కశ్మీర్‌ ప్రజలు) ఏం ఆశలు పెట్టుకుంటారు? వాళ్లు మీకు న్యాయం చేస్తారని అనుకుంటున్నారా?’’అని ఆయన శనివారం బారాముల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ప్రజలు ధైర్యం తెచ్చుకోవాలని, అప్పుడే ఢిల్లీని ఢీకొట్టవచ్చునని అన్నారు. ‘‘ఆ ధైర్యం మీకు లేకపోతే.. మీరు ఉనికిలో లేకుండా పోతారు. మన అస్తిత్వపు ఆనవాళ్లు కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఏదీ మిగలదు. వాళ్లు (ఢిల్లీ) ఇప్పుడు నిశ్శబ్ధంగా ఉన్నారు అంటే.. అంతర్జాతీయ పరిణామాలు కారణం. ఇంకో పక్క పొరుగుదేశం నిత్యం మన వెనుకే ఉంటోంది. 

ఎక్కడికెళ్లినా వాళ్లు... ‘‘కశ్మీర్‌కు సంబంధించిన నిర్ణయం ఇంకా తీసుకోలేదు’’అంటున్నారు. అలాంటి వ్యాఖ్యలే మనల్ని కాపాడుతున్నాయి. లేదంటే కేంద్ర ఉద్దేశాలేమీ అంత బాగా లేవు’’అని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్‌ ప్రజలు భారతీయులం అనేందుకు ఏనాడూ వెనుకాడలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘‘మేము భారతీయులం కామని ఎన్నడూ అనలేదు. మేము భారతదేశంలో కలిసిపో యామని పదే పదే చెబుతూ వచ్చాము.

 మహాత్మా గాం«దీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ల భారతదేశంతో మమేకమయ్యాము’’అని అన్నారు. అయితే హిందూ ముస్లింలను ఒకరిపై ఒకరిని ఉసిగొల్పే రోజు ఒకటి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని, అది కూడా కేవలం అధికారం కోసం.. ఒక్క పీఠం కోసం జరుగుతుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయత నశిస్తుందన్న ఆలోచన తమకెన్నడూ కలగలేదు. కానీ జరిగిపోయింది. అయితే ఇది కూడా కొంతకాలమే. భగవంతుడి దయ వల్ల మళ్లీ మంచిరోజులు వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు.

కూల్చివేతలపై ఏకం కండి 
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఫరూఖ్‌ అబ్దుల్లా అరోపించారు. కూల్చివేతలకు వ్యతిరేకంగా ముస్లింలు అందరూ 
ఏకం కావాలని ఫరూఖ్‌ అబ్దుల్లా పిలుపునిచ్చారు. ఈ కూల్చివేతలు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా చేపడుతున్నట్లు ఆరోపించారు. ఇళ్లు, దుకాణాలు, ప్రార్థన స్థలాలను కూల్చేస్తున్న రాజకీయ పారీ్టలకు ముస్లింలు మద్దతిస్తారని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. హక్కులను కాపాడుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

దేశద్రోహం: బీజేపీ 
పాకిస్తాన్‌ తమను కాపాడుతోందని కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించడం దేశద్రోహమని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. పార్టీ జమ్మూ కశ్మీర్‌ విభాగపు అధ్యక్షుడు సత్‌ శర్మ మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగిస్తే ఫరూఖ్‌ పాకిస్తాన్‌ వెళ్లిపోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. చేసిన వ్యాఖ్యలకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫరూఖ్‌ అబ్దుల్లాపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్‌ ఠాకూర్‌ డిమాండ్‌ చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement