ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు కొనసాగుతుండగా.. ఇప్పుడు మాజీ ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ తన పార్టీతో ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రకటించి ఆసక్తి రేపారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, మొత్తం 403 నియోజకవర్గాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. దీంతో యూపీ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభావం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది.
మిర్జాపూర్ జిల్లాలోని చునార్‌లో శనివారం ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో దివ్య మిట్టల్ ఈ ప్రకటన చేశారు. తమ జననీతి భారత్ పార్టీ చునార్ నియోజకవర్గంలోనూ అభ్యర్థిని నిలబెడుతుందని వెల్లడించారు. స్థానిక ప్రజలు తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. బలమైన అభ్యర్థులు లభించిన చోట్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని 403 స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు.
ఇదే సమయంలో రాజకీయాల్లోకి రావడానికి గల కారణాన్ని వివరిస్తూ దివ్య మిట్టల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయాలు చేయడం కోసం తాను ప్రజల్లోకి రాలేదని, ప్రజల పాలనను స్థాపించి, ప్రజా కేంద్రిత విధానాలను తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. ‘రాజకీయాలు మాత్రమే కాదు.. జననీతి తీసుకురావాలి’ అన్న ఆమె వ్యాఖ్యలు పార్టీ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తున్నాయి. చునార్ పర్యటనలో భాగంగా గుహ్రజ్ నిషాద్ పార్క్‌లోని నిషాద్‌రాజ్ విగ్రహానికి దివ్య మిట్టల్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి తమ పార్టీ ఎన్నికల ప్రణాళికను వెల్లడించారు.
403 స్థానాల్లో పోటీ.. సవాళ్లు ఎన్నో!
2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే బలమైన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జననీతి భారత్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్న లక్ష్యాన్ని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పార్టీ బలం, ప్రజల మద్దతు వంటి అంశాలే ఎన్నికల్లో ఆ పార్టీ ముందడుగును నిర్ణయించనున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందిన దివ్య మిట్టల్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. అయితే, ఆమె పార్టీ యూపీ రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది భవిష్యత్‌లో తేలనుంది. 2027 ఎన్నికల సమయానికి పార్టీ నిర్మాణం, అభ్యర్థుల బలం, ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాల ఆధారంగా జననీతి భారత్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుందో స్పష్టమవుతుంది.
ఇదీ చదవండి: జేడీయూలో కలకలం.. ఎమ్మెల్యే దంపతులపై వేటు


