పట్నా: పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే ఎంతటి నేతలైనా చర్యలు ఎదుర్కోవాల్సిందేనని బీహార్‌లోని జేడీయూ స్పష్టం చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే అనంత్ సింగ్, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే నీలమ్ దేవిలను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి జన్‌సురాజ్ పార్టీ తరఫున ప్రచారం చేయడం, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, పార్టీ ఆదేశాలను ఉల్లంఘించడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేడీయూ బీహార్ విభాగం అధ్యక్షుడు ఉమేశ్ సింగ్ కుష్వాహా వెల్లడించారు.
అనంత్ సింగ్, నీలమ్ దేవిల ప్రాథమిక సభ్యత్వాలను తక్షణమే రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. అంతటితో ఆగకుండా అనంత్ సింగ్ శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. దీంతో పార్టీ నుంచి బహిష్కరణతోపాటు ఎమ్మెల్యే పదవిపై కూడా చర్చ మొదలైంది. ఈ పరిణామం నితీశ్ కుమార్ సైతం తలనొప్పిగా మారినట్టు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంతో వివాదం
ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అనంత్ సింగ్ దంపతులు ప్రత్యర్థి జన్‌సురాజ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని జేడీయూ నాయకత్వం ఆరోపిస్తోంది. అదే సమయంలో పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అధిష్ఠానం ఆదేశాలను పాటించకపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించినట్లు ఉమేశ్ సింగ్ కుష్వాహా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారిద్దరిపై ఆరేళ్ల బహిష్కరణ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. ముకామా అసెంబ్లీ నియోజకవర్గంలో అనంత్ సింగ్ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. 1990 నుంచి ఈ నియోజకవర్గంలో ఆయన కుటుంబం దాదాపుగా వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. దీంతో స్థానిక రాజకీయాల్లో ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. అలాంటి నేపథ్యం ఉన్న ఎమ్మెల్యే అనంత్ సింగ్, ఆయన భార్య నీలమ్ దేవిలను జేడీయూ ఆరేళ్లపాటు బహిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: పాక్ వల్లే ‘కశ్మీర్’ సజీవం


