న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగోల్‌పురి పారిశ్రామిక ప్రాంతంలోని ఫేజ్-1లో ఉన్న ఓ షూ తయారీ కర్మాగారంలో శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కర్మాగారంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురిని రక్షించి, సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు.
అగ్నిప్రమాదం తొలుత భవనం బేస్‌మెంట్‌లో చోటుచేసుకున్నట్లు అగ్నిమాపక అధికారి పరాస్ కుమార్ తెలిపారు. మంటలు పైఅంతస్తులకు వ్యాపించకుండా అడ్డుకున్నామని చెప్పారు. అయితే దట్టమైన పొగ కారణంగా మూడో అంతస్తు మెట్ల మార్గం నుంచి ఒకరిని, నాలుగో అంతస్తు నుంచి ఐదుగురిని రక్షించినట్లు వెల్లడించారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫ్యాక్టరీ యజమానికి సమన్లు జారీ చేయడంతోపాటు కాంట్రాక్టర్, సిబ్బందిని విచారిస్తున్నారు. ప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. దర్యాప్తు వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: Delhi: ఆదివారం హైటెన్షన్.. రెండు భారీ ర్యాలీలు!


