నవంబర్ 1న ‘చలో ఢిల్లీ’లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలి
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు
ఇది భారతదేశ ఆత్మను కాపాడే ఉద్యమమని స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు, ఓట్ల చోరీని అడ్డుకొనేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించే ‘చలో ఢిల్లీ’ర్యాలీలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యార్థి సంఘాలు సైతం ఈ నిరసన ర్యాలీలో చేరాలని కోరారు. పోలీసులకు, వారి లాఠీలకు ఎవరూ బెదరొద్దని స్పష్టంచేశారు.
ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన ర్యాలీ కాదని, భారతదేశ ఆత్మను కాపాడే ఉద్యమమని తేల్చిచెప్పారు. ఈ మేరకు రాహుల్ గాంధీ గురువారం ‘ఎక్స్’లో ఒక వీడియోను పోస్టుచేశారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహార శైలితో ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోయారని తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆరాట పడేవారంతా నిరసన ర్యాలీలో భాగస్వాములు కావాలని కోరారు. ఇది ముమ్మాటికీ దేశ ప్రజల నిరసన అని తేల్చిచెప్పారు. దేశంపై దాడి జరుగుతోందని, ప్రజలు హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, ఆలోచనా విధానాలు దెబ్బతింటున్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తంచేశారు. వాటిని రక్షించుకోవాలంటే ఉద్యమంలో చేరాలని సూచించారు. నవంబర్ 1న జరిగే నిరసన ర్యాలీలో అందరినీ కలుసుకోవాలని తాను ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ చేసిన పోస్టును కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులను రైళ్లను ఏర్పాటు చేయడానికి నిరాకరించారని, ఢిల్లీలో వ్యాపారులను రాజకీయ సాధనంగా వాడుకుంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు సాగించినా నవంబర్ 1న ‘చలో ఢిల్లీ’ర్యాలీ జరిగి తీరుతుందని తేల్చిచెప్పారు. ఇది ఒక వర్గానికి లేదా ఒక రాజకీయ పారీ్టకి సంబంధించిన నిరసన కాదని వివరించారు. ఇది దేశం చేస్తున్న నిరసన అని ఉద్ఘాటించారు. ఎస్‌ఐఆర్ ద్వారా ఓటు హక్కును కోల్పోయిన 13.30 కోట్ల మంది భారతీయుల కోసం ఈ పోరాటం జరుగుతోందని ప్రకటించారు. ఇది రాజ్యాంగం కోసం సాగే యాత్ర, ప్రజాస్వామ్యం కోసం చేసే పాదయాత్ర, ప్రతి భారతీయుడి కోసం ఉద్దేశించిన ఉద్యమం అని తెలియజేశారు.


