జార్ఖండ్‌లో గత 12 ఏళ్లలో నిర్వహించిన జేఎస్‌ఎస్సీ–సీజీఎల్ పరీక్షలన్నీ రద్దు
పరీక్షార్థుల నిరసనోద్యమంతో దిగొచి్చన సోరెన్ సర్కార్
విద్యార్థుల డిమాండ్లను అంగీకరించిన జేఎంఎం ప్రభుత్వం
టీఎస్సార్ డాటాప్రాసెసింగ్ నిర్వహించిన అన్ని పరీక్షలు రద్దు
పరీక్షల్లో అక్రమాలపై సీఐడీ విచారణ
సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో పరీక్షల సంస్కరణల కమిటీ ఏర్పాటు
సంబరాల్లో మునిగిపోయిన విద్యార్థులు
త్వరలోనే దీక్షాస్థలికి వచ్చి నిరాహార దీక్ష విరమిస్తానన్న మహతో
రాంచీ: జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక ప్రక్రియలో అక్రమాలకు చరమగీతం పాడాలంటూ ఉద్యమబాటలో పయనిస్తున్న వేలాది మంది పరీక్షార్థులు, విద్యార్థులు ఎట్టకేలకు విజయం సాధించారు. నిరసనకారుల డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు స్వయంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం ప్రకటించారు. దీంతో గత 24 రోజులుగా రాంచీలోని జైపాల్‌సింగ్ ముండా స్టేడియంలో నిరాహార దీక్షాస్థలిలో ఉద్యమిస్తున్న వేలాది మంది పరీక్షార్థులు, విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి.
ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రిగా రాజీనామా డిమాండ్‌తో జంతర్‌మంతర్‌లో ఉద్యమం మొదలెట్టిన కాక్రోచ్ జనతాపార్టీ ఇచ్చిన స్ఫూర్తితో రాంచీలో నిరాహార దీక్షలు మొదలెట్టిన పరీక్షార్థుల డిమాండ్ల సాధన దిశలో సీఎం సోరెన్ సోమవారం కీలక నిర్ణయాలను వెలువర్చారు. రాంచీలో మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం మాట్లాడారు. ‘‘ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షావిధానంలో అక్రమాలను ఎలుగెత్తిచాటిన విద్యార్థుల మొరలను ఆలకిస్తున్నాం. ఈ దిశలో పటిష్టమైన చట్టం తీసుకురాబోతున్నాం. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్–కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్(జేఎస్‌ఎస్‌సీ–సీజీఎల్‌ఈ)ను రద్దుచేస్తున్నాం.
2014 ఏడాది నుంచి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ‘టీఎస్‌ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్(టీడీపీఎల్)’ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని ఉద్యోగ నియామక పరీక్షలను రద్దుచేస్తున్నాం. టీడీపీఎల్ ఇచ్చిన పరీక్షల ఫలితాలనూ పక్కనబెడుతున్నాం. పరీక్షార్థుల డిమాండ్ల మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ సారథ్యంలో కొత్తగా పరీక్షల సంస్కరణల కమిటీని ఏర్పాటుచేస్తున్నాం’’అని సీఎం ప్రకటించారు. ‘‘పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి ఇప్పటికే మొదలై సీఐడీ, సిట్ దర్యాప్తుల్లో విస్మయకర విషయాలు బయటికొస్తున్నాయి. వాటిని ఇప్పుడే ఇక్కడే చెప్పలేను.
పరీక్షల రాకెట్‌లో రాష్ట్రంలో పలు కంపెనీల పాత్ర ఉందని స్పష్టమైంది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి ఉద్యోగాలు పొందిన వాళ్లను అరెస్ట్ చేస్తున్నాం. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ) ఉన్నప్పటికీ అది సమగ్రంగా అమలుకాలేదని తేలింది. పరీక్షల విధానంలో సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించాం. దానికొచ్చే ఫిర్యాదులను నిపుణులు పరిశీలిస్తారు’’అని సీఎం తెలిపారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి సీఎం తగు నిర్ణయాలు తీసుకో వాలని ఆగస్ట్ 14న సోరెన్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాసిన లేఖ బహిర్గతమైన కొన్ని గంటలకే రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం వెలువర్చడం గమనార్హం.
గత నియామక పరీక్షల ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. సీఎం ప్రకటన వార్త తెలిసి వాళ్లంతా తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. విషయం తెల్సి సోమవారం రాత్రి పలువురు ఉద్యోగులు జార్ఖండ్ సెక్రటేరియట్‌కు వచ్చి నిరసన చేపట్టారు. 2014 నుంచి పరీక్షల్ని రద్దుచేస్తే 2,000 మంది ఉద్యోగాలు కోల్పోతారని వాళ్లు వెల్లడించారు.
ఆనంద డోలికల్లో విద్యార్థులు
సీఎం ప్రకటన వార్త తెలియగానే రాంచీలోని స్టేడియంలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. జేపీఎస్సీ–జేఎస్‌ఎస్‌సీ పరీక్షల సంస్కరణల మంచ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్న పరీక్షార్థుల ఉద్యమనినాదాలతో స్టేడియం మార్మోగిపోయింది. ఇది విద్యార్థుల సమష్టి విజయ మని ఉద్యమనేతలు వ్యాఖ్యానించా రు. అయితే సీఐడీ, సిట్ విచారణలకు బదులుగా సీబీఐతో సమగ్ర స్థాయిలో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌చేశారు. అప్పటిదాకా తమ ఉద్యమం ఆగదని స్పష్టంచేశారు. అయితే గత 16 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న, ప్రస్తుతం సదర్ ఆస్పత్రి ఐసీయూలో ఉన్న ఉద్యమనేత దేవేంద్రనాథ్ మహతో భిన్నంగా స్పందించారు. ప్రధాన డిమాండ్లు నెరవేరిన నేపథ్యంలో త్వరలోనే స్టేడియంకు వచ్చి నిరాహార దీక్షను విరమించాలని భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


