breaking news
All India Services
-
హైకోర్టు తీర్పుతో తేలనున్న తెలంగాణ డీజీపీ భవితవ్యం.. ఏపీకి వెళ్లాల్సిందేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్ కొనసాగుతారా? లేక ఏపీకి వెళ్లాల్సి వస్తుందా అనేది నేడు తేలిపోనుంది. 2014లో ఉమ్మడి ఏపీ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూ ష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల విభజనలో భాగంగా అంజనీకుమార్‌ను ఏపీకి కేటాయించారు. అయితే కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించిన అంజనీకుమార్ తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. గత నెలలో డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేయడంతో ప్రభుత్వం ఆ బాధ్యతలను అంజనీకుమార్‌కు అప్పగించింది. బాధ్యతలు చేపట్టి ఇంకా నెలైనా పూర్తికాకముందే కేడర్ కేటాయింపులకు సంబంధించి తీర్పు రానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన సోమేశ్ కుమార్‌కు ఈనెల 10న హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించినందున అక్కడే వెళ్లి విధులు నిర్వహించాలని తేల్చిచెప్పింది. దీంతో ఆయన సీఎస్ విధులకు రాజీనామా చేసి, ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు. ఆయన ఏపీలో బాధ్యతలు చేపడ తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ నేపథ్యంలో నేడు వెలువడనున్న తీర్పు డీజీపీకి అనుకూలమా.. ప్రతికూలమా? అన్నది సందిగ్ధంగా మారింది. సోమేశ్‌లానే తీర్పు వెలువడితే అంజనీకుమార్ కూడా ఏపీకి వెళ్లాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఒక రాష్ట్రంలో కోర్టు తీర్పుల కారణంగా ఒకే నెలలో సీఎస్, డీజీపీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి రావడం దేశంలో ఇదే తొలిసారి అవుతుంది. వీరిద్దరూ బిహార్ రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం. అంజనీకుమార్‌తోపాటు మరికొందరు ఆలిండియా కేడర్ సర్వీస్ అధికారులు కూడా క్యాట్ అనుమతి పొంది తెలంగాణలో పనిచేస్తున్నారు. వీరందరికీ సంబంధించి కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నేటి తీర్పుతో డీజీపీ అంజనికుమార్ సహా 12 మంది అధికారుల భవితవ్యం కూడా తేలిపోనుంది. -
భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ప్రమోషన్లు..!
సాక్షి, హైదరాబాద్ : భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతుండటంతో ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుంది. 49 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు ప్రమోషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం 15 జీవోలు జారీ చేసింది. 26 ఐఏఎస్‌లకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం వారిలో ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ప్రమోషన్ ఇచ్చింది. ఒకరికి ముఖ్య కార్యదర్శి, నలుగురికి కార్యదర్శి, ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా పదోన్నతులు ఇచ్చారు. ఐదుగురు ఐఏఎస్‌లకు సంయుక్త కార్యదర్శిగా, మరో నలుగురికి డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురు ఐఏఎస్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. 23 మంది ఐపీఎస్‌లకు ప్రమోషన్ ఇచ్చిన సర్కార్.. వారిలో ఐదుగురికి అదనపు డీజీలుగా, నలుగురికి ఐజి, ఏడుగురికి డీఐజీ, ఆరుగురికి సీనియర్ స్కేల్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరొక ఐపీఎస్ అధికారికి కూడా ఐజీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. -
కలెక్టర్‌గా ప్రియదర్శిని
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కలెక్టర్ ఎం.జగన్మోహన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న జీడీ ప్రియదర్శినిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఏఐఎస్ (అఖిల భారత సర్వీసుల) అధికారుల విభజన కొలిక్కి రావడంతో ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లపై దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు, ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్‌ను కూడా బదిలీ చేసింది. 2014 జూన్ 29న కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న జగన్మోహన్ ఏడు నెలల లోపే బదిలీ కావడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంతో సౌమ్యునిగా పేరున్న జగన్మోహన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జిల్లా పాలనపై తనదైన ముద్ర వేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ వహించారు. సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే, మన ఊరు.. మన ప్రణాళికల రూపకల్పన విజయవంతంగా చేపట్టారు. దళిత బస్తీ పథకం అమలులో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా చేశారు. అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులతోపాటు, అన్ని స్థాయిలో అధికారులు, సిబ్బందితో కలుపుగోలుగా ఉన్నారు. ప్రజాప్రతినిధులకు కూడా అందుబాటులో ఉంటూ పాలనను కొనసాగించారు. జిల్లాలో ఆరు నెలలుగా జాయింట్ కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. జేసీగా పనిచేసిన లక్ష్మీకాంతం బదిలీ తర్వాత ఆ స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. అలాగే ఐటీడీపీ ప్రాజెక్టు ఆఫీసర్ స్థానం కూడా ఖాళీగా ఉంటోంది. ఇన్నాళ్లు ఏఐఎస్ అధికారుల విభజన పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయడానికి వీలుపడలేదు. దీంతో కలెక్టర్ జగన్మోహన్ జేసీగా కూడా అదనపు బాధ్యతల్లో కొనసాగారు. రెండు కీలక పోస్టింగ్‌లను సమర్థవంతంగా నిర్వహించారు. జిల్లా అధికార యంత్రాంగంపై ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో పట్టు సాధించిన ఆయన అక్రమార్కులపై చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇంతలోనే కలెక్టర్ బదిలీ కావడం గమనార్హం. కాగా జగన్మోహన్ జిల్లాకు వచ్చిన కొన్ని నెలలకే ఆయన సతీమణి అరుణకుమారికి కూడా ప్రభుత్వం జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. ఫారెస్టు సెటిల్మెంట్ అధికారిగా కొన్ని నెలల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు కలెక్టర్ బదిలీ అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. మంత్రులకూ సమాచారం కరువు.. కలెక్టర్ బదిలీ, కొత్త కలెక్టర్ నియామకాల విషయంలో జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా సమాచారం లేదు. కనీసం వీరితో మాటవరుసకైనా చర్చించకుండానే ఉత్తర్వులు వెలువడటం వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్లు సమాచారం. దీంతో మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం జిల్లాలోని తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లారు. సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ విషయమై సోమవారం సాయంత్రం సీఎంతో సమావేశం కావాలని భావించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బదిలీని నిలిపివేయాలని సీఎంకు విజ్ఞప్తి చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. కానీ ఈ సమావేశం మంగళవారానికి వాయిదా పడింది. కొత్త కలెక్టర్ ప్రియదర్శిని జిల్లా కలెక్టర్‌గా నియమితులైన జీడీ ప్రియదర్శిని 2008 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు కూడా కేవలం ఆరు నెలలలోపే బదిలీ అయ్యింది. 2014 జులై 31న మహ బూబ్‌నగర్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆమె.. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వస్తున్నారు. ప్రియదర్శిని హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు చెందిన వారు. ప్రస్తుతం గచ్చిబౌళిలో నివాసం ఉంటున్నారు. ఆమె బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. ఆమె తండ్రి బెంజుమన్ దీవెనయ్య ఆదాయపు పన్ను శాఖలో ఉన్నత స్థానంలో పనిచేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను, నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారనే పేరుంది. రాజకీయ, ఏ ఇతర ఒత్తిళ్లను లెక్కచేయరనే పేరుంది. పనిచేసిన స్థానాలు.. 2002 బ్యాచ్ గ్రూప్-1 అధికారిణి అయిన ప్రియదర్శిని ముందుగా విపత్తుల శాఖ సహాయ కమిషనర్‌గా పనిచేశారు. హౌజింగ్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2008లో సీసీఎల్ఏ కమిషనర్‌గా కొనసాగారు. ఈ సమయంలో ఆమెను ఐఏఎస్‌గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అనంతరం నల్గొండ జిల్లాకు జేసీగా బదిలీ అయ్యారు. అక్కడ సుమారు ఏడాది పనిచేశారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌కు నార్త్‌జోన్ సహాయ కమిషనర్‌గా మూడున్నర ఏళ్లు పనిచేశారు. తర్వాత 2014 అక్టోబర్ 30న అపార్డ్‌కు డెరైక్టర్‌గా వెళ్లారు. అక్కడ ఎనిమిది నెలలు పనిచేసిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాకు కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2014 జూలై 31న మహబూబ్‌నగర్ బాధ్యతలు చేపట్టారు.