ఐదు నుంచి తగ్గించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగుల కేడర్ కేటాయింపులు తదితర నియమ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఇప్పటిదాకా ఐదు జోన్లుగా విభజించగా ఇప్పుడు ఆ సంఖ్యను నాలుగుకు తగ్గించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది.
గ్రూప్ 1లో అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాలు, ఏపీ, అస్సాం–మేఘాలయ, బిహార్, ఛత్తీస్‌గఢ్;
గ్రూప్ 2లో గుజరాత్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్;
గ్రూప్ 3లో మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్తాన్, సిక్కిం, తమిళనాడు;
గ్రూప్ 4లో తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ను అక్షరక్రమంలో చేర్చారు.
ప్రతి రాష్ట్రం తన పరిధిలో ఈ సర్వీసుల తాలూకు ఖాళీలను ఏటా జనవరి 31 నాటికి కేంద్రానికి విధిగా నివేదించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఆ ఏడాది భర్తీ చేయబోయే మొత్తం ఖాళీల సంఖ్యను కేంద్రం నిర్ధారిస్తుంది. అలాగే అధికారులకు హోం కేడర్ కేటాయింపు తదితర నిబంధనల్లో కూడా స్వల్ప మార్పుచేర్పులు చేశారు.


