‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్’ అంటూ సరస్వతీ ప్రార్థనతో ఒక చాటుపద్యం ప్రారంభమవుతుంది. ‘నువ్వు నా మనసులో నిలిచి, మంచి, అందమైన మాటల్ని ధారగా ఇష్టంగా నాతో పలికించ’మని ఆ పద్యకవి ఆమెను ప్రార్థిస్తాడు. ‘జగత్తునే మోహపెట్టేదిగా, విప్పారిన కన్నులూ, పూర్ణచంద్రునివంటి ముఖమూ కలిగినదిగా’ ఆమెను సంబోధిస్తాడు. మరో కోణంలో ఈ పద్యం పుస్తకమెలా ఉండాలో చెబుతోంది– అది వాగ్ధారతోనే కాక, ఆ వాక్కులు మంచివిగానూ, అందంగానూ ఉండాలంటోంది. సరస్వతికి ఉపయోగించిన విశేషణాలను పుస్తకానికి కూడా అన్వయిస్తే, అది పాఠకజగత్తును మోహపెట్టేలా, వారి చూపుల్ని విశాలపరిచేలా, పూర్ణచంద్రుడిలా ఆహ్లాదం గొలిపేలా ఉండాలి. పుస్తకమెలా ఉండాలో చెప్పడమంటే, ఎలా ఉండకూడదో చెప్పడమే. పుస్తకాన్ని దేవతతో ముడిపెట్టడమంటేనే, దానికి పవిత్రతను ఆపాదించడం!
అందం, ఆహ్లాదం, పవిత్రతా వగైరాలనలా ఉంచితే, పుస్తకంపట్ల కనీసమైన భక్తి శ్రద్ధలను, బాధ్యతను చాటుకుంటున్నామా? తొలినాటి వాగ్రూపదశ దాటి, లేఖనంతో మొదలైన తాళపత్రాలు, భూర్జపత్రాలదశలోకీ కాగితం దశలోకీ అడుగుపెట్టి అక్కడి నుంచి తాజాగా ఆడియో పుస్తకాల రూపంలో మరోసారి వాగ్రూపానికి చేరుకున్న ఇన్ని వందల, వేల సంవత్సరాల వ్యవధిలో కూడా పుస్తకరచననూ, ప్రచురణనూ ఉన్నత ప్రమాణాలు కలిగిన ఒక వ్యవస్థగా మనం పూర్తిగా అభివృద్ధి చేసుకోగలిగామా? సినిమా వంటి నిన్నమొన్నటి జనమాధ్యమాలతో పోటీపడే స్థాయిలో పుస్తకాన్ని జనసామాన్యంలోకి తీసుకెళ్ళగలిగామా? కవులు, రచయితలకిచ్చే గుర్తింపును– నటులకు, నాయకులకు ఇచ్చే గుర్తింపులో సగానికైనా పెంచగలిగామా? ఇప్పుడు మరింత ఎక్కువమందికి అందు బాటులోకి వచ్చిన పుస్తకం ద్వారా జ్ఞాన, విజ్ఞాన, సారస్వతవ్యాప్తిలో మరింత పురోగ మనాన్ని సాధించే బదులు తిరోగమనాన్ని చిత్తగించిన దాఖలాల సంగతేమిటి?!
సరస్వతిలానే ప్రకృతి కూడా తల్లే. ఆ తల్లి జీవపరిణామ క్రమంలో మనిషికి మెదడు నిచ్చింది; ఆ మెదడు జ్ఞాన, విజ్ఞాన, సారస్వతావిష్కారాల వైపు మనిషిని నడిపించింది; మెదడుకు సమాంతరంగా ప్రకృతి ప్రసాదించిన మాట ఆ జ్ఞాన, విజ్ఞానాదులను తోటి మనిషితో పంచుకునే సౌలభ్యమిచ్చింది. అప్పటినుంచీ జ్ఞాన, విజ్ఞానవ్యాప్తిలో మనిషి మడమ తిప్పింది లేదు. వాక్కునే జ్ఞానవాహిక చేసుకుని మాటలల్లి, వాటికి ఆటపాటలు జోడించి జనంలోకి తీసుకెళ్ళి భావి కావ్యేతిహాసాలకు బీజావాపం చేసిన చరిత్ర మనిషిది. ఆదికవి నన్నయ భట్టు తన ఆంధ్రమహాభారత కృతిభర్త రాజరాజనరేంద్రుని ఆస్థానాన్ని వర్ణిస్తూ– అపార శబ్దశాస్త్రపారగులైన వైయాకరణులు, భారతరామాయణాద్యనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులు, నవార్థవచనరచనా విశారదులైన మహాకవులు, సమస్తశాస్త్ర సాగర గరీయ ప్రతిభులైన తార్కికులు మొదలైన విద్వజ్జనాలు ఆయనను పరివేష్ఠించి ఉన్నారంటాడు. శ్రీనాథ మహాకవి విజయనగరంలో ప్రౌఢదేవరాయల ఆస్థాన పండితు డైన గౌడడిండిమ భట్టును శాస్త్రవాదంలో ఓడించి అతని కంచుఢక్కను పగులగొట్టించడం మరో ప్రసిద్ధ ఉదాహరణ.
ఏ జ్ఞానరంగంలోనైనా అపశబ్దాలు, అపరిణతులు, అతర్కాలు, కుతర్కాలు చోటు చేసుకోకుండా ఆనాటి గురువులతోపాటు, పండితపరిషత్తులు అంకుశంలా పనిచేస్తూ జ్ఞానస్వచ్ఛతను పరిరక్షించడానికి ప్రయత్నించాయి. ఇప్పటి పుస్తక ప్రచురణ భాషలో చెప్పాలంటే ‘పరిష్కర్త’ పాత్రను నిర్వహించాయి. అటువంటిది, కాగితమూ, అచ్చుయంత్రమూ అందుబాటులోకి రావడంతో పుస్తకరూపం ధరించిన జ్ఞానం పండిత పరిషత్తు లనూ, రాజాస్థానాలను దాటి వందల సంవత్సరాల క్రితమే ప్రజాస్థానంలోకి అడుగు పెట్టినా, మనదేశంలో ఇప్పటికీ పుస్తకప్రచురణ ఉన్నత ప్రమాణాలు కలిగిన వ్యవస్థగా అభివృద్ధి చెందకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పుస్తకమూ, పుస్తక రచనా ప్రజాస్వామికమవుతూ అన్ని వర్గాలకూ అందుబాటులోకి రావడం శుభపరిణామ మను కుంటే; ‘పరిష్కర్త’ రూపంలో అంకుశం లోపించి నాణ్యత అడుగంటడాన్ని ఎలా చూడాలి? దాంతో పుస్తకాలు అనేకం అమ్ముకునే స్థాయికి చేరకుండా ఉచితంగా పంచి పెట్టే స్థాయిలోనే ఉండిపోతున్నాయి. దాని ప్రభావం మంచి పుస్తకాలపైనా పడుతోంది. ఇప్పటికైనా మేలుకుని ప్రచురణ రంగాన్ని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుకోకపోతే హస్తభూషణం కావలసిన పుస్తకం ‘ఉత్త’ భూషణంగానే ఎప్పటికీ ఉండిపోతుంది.


