నియంత పోకడలు తగునా?! | Sakshi Editorial On Special Intensive Revision | Sakshi
Sakshi News home page

నియంత పోకడలు తగునా?!

Sep 25 2026 1:24 AM | Updated on Sep 25 2026 1:24 AM

Sakshi Editorial On Special Intensive Revision

ఇల్లిల్లూ తిరిగి, అర్హతగలవారికి ఓటు హక్కు కల్పించే దశాబ్దాల ఒరవడికి గండికొట్టి, వారిని అనుమాన దృక్కులతో చూస్తూ ఓటుకు ఎసరుపెట్టే దిక్కుమాలిన నిబంధనలు తెచ్చినవారి బండారం భళ్లున బద్దలైంది. ఎన్నికల సంఘం (ఈసీ)లో సాగుతున్న ఏకపక్ష పోకడలపైనా, అమలవుతున్న నిర్ణయ ప్రక్రియపైనా ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వెలువరిస్తున్న కథనాలు దేశ ప్రజలను దిగ్భ్రాంతిలో ముంచాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌... త్రిసభ్య సంఘంలోని మిగతా ఇద్దరు కమిషనర్‌లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, వివేక్‌ జోషిల అభ్యంతరాలను బేఖాతరు చేయటం, కొన్నిసార్లు వారికి తెలియకుండా కూడా నిర్ణయాలు తీసుకోవడం వంటి అప్రజాస్వామిక ధోరణులకు పాల్పడుతున్నారని సాక్ష్యాధారాలతో ఆ పత్రిక బట్టబయలు చేసింది. ‘ఏ సంస్థలోనైనా భిన్నాభిప్రాయాలుంటాయ’ంటూ దీన్నంతటినీ సమర్థించుకోజూస్తున్న ఈసీ బరితెగింపు సిగ్గుచేటు. 

ఇవి కేవలం భిన్నాభిప్రాయాలా? దీనివల్ల ఒక నిరుపేద కూలీ, వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందిపడే బడుగుజీవి, పెళ్లయ్యాక ఉన్న ఊరూ, ఇంటిపేరూ మార్చు కోవాల్సి వచ్చిన ఒక సగటు మహిళ, అంతంతమాత్రం అక్షరాస్యతతో అవస్థలుపడే మరొక సాధారణ వ్యక్తి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, పడతారో... వారి జీవితాలు ఎంతగా తలకిందులయ్యాయో జ్ఞానేశ్‌కు తెలుసా? ఎన్ని లోటుపాట్లున్నా స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తూ 1952 నుంచి సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ చేస్తూ వచ్చి ప్రపంచ దేశాల్లో ప్రశంసలు పొందిన చరిత్ర మన ఈసీకుంది. కానీ జ్ఞానేశ్‌ రాకతో అదంతా గంగలో కలిసింది. బిహార్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) పేరిట ‘స్వచ్ఛ ఓటర్ల జాబితా’ రూపకల్పన కోసమంటూ తెచ్చిన నిబంధనలూ, వాటి పర్యవసానాలూ అందరి ఎరుకలోకీ వచ్చినప్పటినుంచి దాని ప్రాభవం కొడిగట్టడం మొదలైంది. అయినా దేశంలోని ఇతర రాష్ట్రాలన్నిటా సర్‌ కొనసాగుతూనే ఉంది. 

అమల్లోవున్న నిబంధనలు హఠాత్తుగా మార్చిన వైనంగానీ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లకు అనుసరించిన భిన్న విధానాలుగానీ గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కొత్తగా ఓటుహక్కు పొందదల్చుకునేవారు ఆన్‌లైన్‌లో పంపాల్సిన ఫామ్‌–6 ఇందుకొక ఉదాహరణ. వారి తల్లిదండ్రుల పేర్లు 2002 నాటి సర్‌ జాబితాలో ఉంటే పేర్కొనాలన్నది కొత్తగా తీసుకొచ్చిన నిబంధన సారాంశం. ఆన్‌లైన్‌లో కాక, నేరుగా అందించే ఫామ్‌లో ఇది లేదు. అయినా చెల్లుతుందట! దీన్ని మిగతా ఇద్దరు కమిషనర్లూ వ్యతిరేకించి 1950 నాటి ఓటింగ్‌ నిబంధనల్లో సవరణ తీసుకొస్తే తప్ప ఇలా చేయటం కుదరదని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇక తాము అనుసరించిన పనికిమాలిన సాఫ్ట్‌వేర్, అక్షర క్రమంలో వచ్చే తేడాలు బెంగాల్‌లో 27 లక్షలమంది ఓటర్ల హక్కును హరించా యంటే... పరిష్కరించాల్సిన ట్రిబ్యునళ్లకు వ్యవధిలేక వారంతా ఈ ఎన్నికల్లో ఓటేయలేకపోయారంటే జ్ఞానేశ్‌ నిర్వాకం ఎలాంటిదో అర్థమవుతుంది. అక్కడే కాదు... తెలంగాణలో దాదాపు 93 లక్షల మందిని, ఏపీలో 44 లక్షల మందిని జాబితాల్లో మాయం చేసింది. దేశవ్యాప్తంగా ఇలా 13 కోట్లమందిని అయోమయంలోకి నెట్టారు. దీనర్థం ఏమంటే... వారి కుటుంబాల్లో తదనంతర తరాలు సైతం ఓటుహక్కుకు దూరమవుతాయి. 

పదినెలల వ్యవధిలో సర్‌ నిబంధనలకింద ఓటర్ల రిజిస్ట్రేషన్, పేర్ల తొలగింపు, ఓటర్ల జాబితా భద్రత వ్యవహారాలపై సంధూ, వివేక్‌ జోషిలిద్దరూ 14 అభ్యంతరాలు వ్యక్తంచేసినా దిక్కులేని స్థితి ఏర్పడిందంటే ఏమనాలి? జ్ఞానేశ్‌ ప్రధాన ఎన్నికల కమిషనరే కావొచ్చు. కానీ మిగతా ఇద్దరి అభ్యంతరాలను బేఖాతరు చేసేంత అదనపు అధికారం ఆయనకేమీ లేదు. ఆ పదవి ఆయనకు వరస క్రమంలో తొలిస్థానాన్నిస్తుంది తప్ప నిర్వహణకు సంబంధించి ముగ్గురూ సమానులు. టీఎన్‌ శేషన్‌ కేసులో చాన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టే ఈ సంగతి స్పష్టం చేసింది. కానీ ఈ జ్ఞానం ఆయనకున్నట్టులేదు. జనం మనోభీష్టాన్ని ప్రతిబింబించే ఎన్నికలు అతి కీలకమైనవి. వాటి నిర్వహణ ఒక అసిధారా వ్రతం. దాన్ని భ్రష్టుపట్టించటం ఖండనార్హం. ప్రజాస్వామ్యమంటే భయమూ లేక, భక్తీ లేక ఇష్టారాజ్యం చలాయించే, నియంతృత్వ పోకడలు అనుసరించే బాపతు వ్యక్తులు ఇంతటి కీలక బాధ్యతల్లో కొనసాగటం అవాంఛ నీయం, అభ్యంతరకరం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement