పర్యాటకంలో 48 శాతం తీర్థయాత్రలే
29 శాతం వైద్యపర్యాటకం
ఆహ్లాదం కోసం 22 శాతమే
పర్యాటకంలో మొదటిస్థానంలో యూపీ
రెండు, మూడుస్థానాల్లో బిహార్, తమిళనాడు
డొమెస్టిక్ టూరిజం ఎక్స్‌పెండీచర్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రేమ యాత్రలకు బృందావనమూ.. నందనవనమూ ఏలనో... అని గుండమ్మకథ సినిమాలో పాపులర్ పాట. ప్రేమయాత్రల సంగతేమిటోగానీ యాత్రలు అంటే తీర్థయాత్రలేనని భారతీయులు అత్యధికంగా భావిస్తున్నారు. మనదేశంలో దేశీయ పర్యాటకులు తీర్థయాత్రలకే అగ్రస్థానం ఇస్తున్నట్లు తేలింది. కేంద్రప్రభుత్వ గణాంక, కార్యక్రమాలఅమలు శాఖ దేశీయ పర్యాటక వ్యయ నివేదిక పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ కీలక అంశాలను వెల్లడించింది. మొత్తం 2.46 లక్షల కుటుంబాలను సర్వేచేసి ఆ నివేదికను రూపొందించింది.
నివేదికలోని ప్రధాన అంశాలు
» దేశీయ పర్యాటకుల్లో తీర్థయాత్రలే అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. 48 శాతం మంది ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అధ్యాత్మిక కేంద్రాల సందర్శనకే యాత్రలు చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీర్థయాత్రలపట్ల అత్యధికంగా మొగ్గు చూపిస్తున్నారు.
» పర్యటనల్లో రెండోస్థానంలో వైద్యపర్యాటకం ఉంది. 29 శాతం మంది వైద్యచికిత్సలు, ఇతర ఆరోగ్య సంబంధిత అంశాలపై ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
» ఆహ్లాదకర ప్రాంతాల సందర్శన కోసం 22 శాతం మంది యాత్రలు చేస్తున్నారు.
» షాపింగ్ కోసం 0.6 శాతం మంది ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
» భారతీయ దేశీయ పర్యాటకులు సగటున 5 రోజుల పాటు యాత్ర చేస్తున్నారు. 80 శాతం మంది ఏటా ఐదురోజులు యాత్రలు చేస్తున్నారు.
» గ్రామీణ ప్రాంతాల ప్రజలు 32 శాతం మంది బస్సు ప్రయాణాలపట్ల మొగ్గు చూపుతుండగా.. పట్టణ ప్రాంతాల ప్రజలు 35 శాతం మంది రైలు ప్రయాణాలకు ప్రాధాన్యమిస్తున్నారు.
» దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తోంది. అత్యధికంగా 15.7 శాతం మంది ఉత్తరప్రదేశ్‌ను సందర్శిస్తున్నారు. 10.5 శాతం మంది యాత్రికులతో బిహార్ రెండోస్థానంలో నిలవగా, 9.6 శాతం మంది యాత్రికులతో తమిళనాడు మూడోస్థానంలో ఉంది.
» గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక కుటుంబం సగటున రూ.29,454 యాత్రల కోసం వెచ్చిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఒక కుటుంబం సగటున రూ.41,649 ఖర్చు చేస్తోంది.


