రబీలో జాడలేని సబ్సిడీ విత్తనాలు
నేటి నుంచి రబీ సీజన్ ప్రారంభం
గతంలో సెప్టెంబర్ 15 నుంచే శనగ విత్తనాల పంపిణీ
అక్టోబర్ 1 నుంచి వరి సహా ఇతర విత్తనాల సరఫరా
రెండేళ్లుగా సబ్సిడీ విత్తనాలకు మంగళం
గతంలో విపత్తుల వేళ 80 శాతం సబ్సిడీపై విత్తన సరఫరా
రెండేళ్లుగా విత్తనాలకు దిక్కులేదు
కనీసం రబీ సన్నద్ధతపై సమీక్ష కూడా చేయని చంద్రబాబు ప్రభుత్వం
ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం అన్నీ గాలికి
ఏ దశలోనూ వ్యవసాయ రంగాన్ని పట్టించుకోని వైనం
వ్యవసాయమే దండగ అన్న నాయకుడి పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు సర్కారులో ఇసుమంతైనా చలనం లేకపోవడం అన్నదాతకు శాపమైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులను చేయి పట్టుకుని నడిపించిన ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. ప్రత్యామ్నాయంగా ఎలాంటి సాయం చేయకుండా చంద్రబాబు సర్కార్ రిక్త హస్తం చూపుతోంది. ఫలితంగా ఖరీఫ్‌లో వేసిన విత్తనాలు మొలక దశలోనే ఎండిపోగా.. నాట్లకు అనువుగా లేని భూములు రైతులను ఇళ్లకే పరిమితం చేశాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకుండానే ఖరీఫ్ ముగిసింది. నేటి నుంచి మొదలవుతున్న రబీ సీజన్‌కైనా రైతులను సన్నద్ధం చేయడాన్ని గాలికి వదిలేసింది. కనీసం సబ్సిడీ విత్తనాలను కూడా సమకూర్చలేదంటే వ్యవ‘సాయం’ ఇక అంతేగతి అని స్పష్టం చేస్తోంది.
సాక్షి, అమరావతి: ఏ దశలోనూ ప్రభుత్వం ఆదుకోక పోవడంతో ఖరీఫ్‌పై ఆశలు పూర్తిగా వదులుకున్న రైతులు.. రబీ సీజన్‌పైనే గంపెడాశలు పెట్టుకున్నారు. రెండేళ్లుగా సబ్సిడీ విత్తన సరఫరాకు మంగళం పాడేసిన చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఈ ఏడాది అయినా అదునుకు విత్తనాలు సరఫరా చేస్తుందో లేదో తెలియని దుస్థితి నెలకొంది. ఖరీఫ్ సాగుకు దూరమైన రైతులు ముందస్తు రబీ విషయంలో ఏవిధంగా ముందుకెళ్లాలో తెలియక గగ్గోలు పెడుతున్నారు. రబీ సీజన్ గురువారం నుంచి మొదలవుతోంది. రబీ సాధారణ సాగు లక్ష్యం 53.80 లక్షల ఎకరాలు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే ప్రధాన పంట శనగ. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎక్కువగా శనగ సాగవుతుంది. ఏటా సగటున 10–12 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేస్తారు. సాధారణంగా రబీ సీజన్ అక్టోబర్ 1న ప్రారంభమవుతుంది. ముందస్తు రబీకి వెళ్లేవారు అక్టోబర్ మొదటి వారంలో విత్తనాలు విత్తుకుంటారు. గతంలో సాగు లక్ష్యాలకు అనుగుణంగా విత్తన పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు చేసేవారు.
జిల్లాల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి రైతుల నుంచి సేకరించిన విత్తనాలతో పాటు ప్రైవేటు కంపెనీల నుంచి టెండర్ల ద్వారా సేకరించే విత్తనాలను సీజన్‌కు ముందుగానే అందుబాటులో ఉంచేవారు. విత్తనం కోసం సెప్టెంబర్ 10వ తేదీ నుంచే ఆర్బీకేల్లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకునేవారు. సెప్టెంబర్ 15 నుంచి శనగ విత్తనం, అక్టోబర్ 1 నుంచి వరి సహా ఇతర విత్తనాలు పంíపిణీ చేసేవారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సాధారణ పరిస్థితుల్లో 40 శాతం, కరువు, కాటకాలు, వైపరీత్యాల వేళ 80 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రెండేళ్లుగా అడ్డగోలు కోతలు పెడుతూ సబ్సిడీ విత్తనాన్ని రైతులకు దూరం చేశారు. గతంలో ఏటా సగటున ఈ సీజన్‌లో 2.75 లక్షల క్వింటాళ్లకు తక్కువ కాకుండా శనగ విత్తన సరఫరా అయ్యేవి. ఫలితంగా 2019–24 మధ్య సగటున ఏటా 11.50 లక్షల ఎకరాల్లో సాగైన శనగ పంట రబీ 2024–25లో 7.5 లక్షల ఎకరాలు, రబీ 2025–26 సీజన్‌లో 4 లక్షల ఎకరాలకు పరిమితమైంది.
ఇండెంట్ భారీగా.. నిల్వలు అరకొరగా..
ఓ వైపు కరువుతో ఖరీఫ్‌కు దూరమైన రైతులకు 100 శాతం సబ్సిడీపై విత్తనాలిచ్చినా నిలదొక్కుకునే పరిస్థితిలో లేరు. అయినా సరే తామేదో వారిని ఉద్దరిస్తున్నట్టు 35 శాతం సబ్సిడీపై శనగ విత్తనం ఇస్తున్నామంటూ చంద్రబాబు సర్కారు గొప్పలు చెబుతోంది. 2026–27 సీజన్‌లో 2.50 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం కోసం జిల్లాల నుంచి ఇండెంట్ రాగా.. ఇప్పటివరకు పట్టుమని 25 వేల క్వింటాళ్ల విత్తనం కూడా నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. శనగ విత్తనానికే దిక్కులేకపోగా.. ఇదే సీజన్‌లో సరఫరా చేయాల్సిన చేసే వరి, అపరాలు, చిరుధాన్యాల విత్తనాలు కూడా గగనంగానే కనిపిస్తున్నాయి.
ప్రణాళిక ఏదీ!?
ఖరీఫ్‌లో దాదాపు 25 లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది. ఆ మేరకు ఖరీఫ్‌లో 11.82 లక్షల ఎకరాలు, ముందస్తు రబీకింద 6.15 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని అధికారులు సంకల్పించారు. ఖరీఫ్ మాట దేవుడెరుగు కనీసం ముందస్తు రబీకైనా అవసరమైన మేరకు శనగ విత్తనాలు సిద్ధం చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. రబీ సీజన్‌పైనా కరువు ప్రభావం ఉంటుందని ఓ వైపు వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నా చంద్రబాబు సర్కారు తనకేమీ పట్టనట్టుగా చేష్టలుడిగి చూస్తోంది. రైతులు బహిరంగ మార్కెట్‌లో శనగ విత్తనాలు కొనుగోలు చేద్దామన్నా క్వింటాల్ రూ.9 వేలకుపైగా పలుకుతోంది. అదునుకు కనీసం సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయాలని రైతులు చేతులెత్తి వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూస్తోంది. ఈక్రాప్, ఉచిత పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం.. తదితరాలన్నింటినీ గాలికి వదిలేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా మొత్తానికి మించి.. కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా ఏటా రూ.20 వేలు ఇస్తామని మాట తప్పింది. ఇలా ఏ దశలోనూ రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
80 శాతం సబ్సిడీపై విత్తనాలివ్వాలి
కరువుతో ఖరీఫ్ పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ కష్టకాలంలో గతంలో మాదిరిగా 80 శాతం సబ్సిడీపై విత్తన సరఫరా చేయాలి. వీలుకాకపోతే కనీసం 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి. మా ఆర్బీకేకు వెళ్తే ఇంకా విత్తనం రాలేదన్నారు. గత ఏడాది ఆలస్యంగా విత్తనాలివ్వడంతో బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేసి ఆరెకరాల్లో విత్తుకున్నా. ఆశించిన దిగుబడులు రాలేదు. ఈ ఏడాది కూడా విత్తనాల కోసం దిక్కులు చూసే పరిస్థితి నెలకొంది.
– వెంకటేష్, చాబాల, అనంతపురం జిల్లా
పత్తి వేసి రూ.3 లక్షలు నష్టపోయా
ఖరీఫ్‌లో 10 ఎకరాల్లో పత్తి వేశాను. వర్షాభావంతో పంట ఎదగలేదు. చేసేదిలేక పంటను పూర్తిగా తొలగించేశా. దాదాపు 3 లక్షలకు పైగా నష్టపోయాను. రబీలో శనగ వేయాలనుకుంటున్నా. ఇప్పటివరకు మా ఆర్బీకేకు విత్తనం రాలేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
– గోపీనాథ్‌రెడ్డి, మిడుతూరు, అనంతపురం జిల్లా


