మాజీ మంత్రి హరిరామ జోగయ్య కుమారుడిపై అనుచరులతో కలిసి దాడి
సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్‌లో టీడీపీ మాజీ డిప్యూటీ మేయర్ కుమారుడి వాసిరెడ్డి బాబి వీరంగం సృష్టించాడు. తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి వెంకట రామదాసుపై దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో రామదాసుతో పాటు ఆయన భార్య, కుమారుడు, గుమస్తాలపై కూడా దాడి జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి వాసిరెడ్డి బాబిపై ప్రకాశ్‌నగర్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇటీవల డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితులకు సహకరించారనే ఆరోపణలు కూడా వాసిరెడ్డి బాబిపై ఉన్నాయి.
ఓ మహిళపై వాచ్ మెన్ అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంగా గొడవ మొదలు కాగా వాచ్ మెన్‌పై చేగొండి వెంకట రామదాసు చేయి చేసుకున్నారు. దీంతో రామదాసుపై వాచ్ మెన్‌తో వాసిరెడ్డి బాబి ఫిర్యాదు చేయించారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు రామదాసుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ గొడవలో పోలీసులు మొత్తంగా మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


