సాక్షి, తాడేపల్లి: తెనాలిలో పోలీసుల చేతిలో దారుణంగా హింసకు గురైన నలుగురు దళిత యువకులకు జరిగిన అవమానం, మానసిక క్షోభకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, అందుకుగాను బాధిత కుటుంబాలకు వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. తెనాలిలో నలుగురు దళిత యువకులను రోడ్డుపై దారుణంగా కొట్టి హింసించిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన గుర్తు చేశారు.
ఆ కుటుంబాల గౌరవం కాపాడాలి:
ఈ కేసులో యువకులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించి క్లీన్ అక్విటల్ ఇవ్వడం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని గోరంట్ల మాధవ్ అన్నారు. బాధిత యువకుల డిగ్నిటీ, డిసెన్సీ, వారికి జరిగిన అవమానానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాతో పాటు, వారి గౌరవాన్ని కాపాడేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల హక్కు కాలరాస్తున్నారు:
పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. బీఎన్‌ఎస్, బీఎన్‌ఎస్‌ఎస్, బీఎస్‌ఏ వంటి చట్టాలను అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థ, లోకేష్ చేతిలో ఉన్న ఎర్రబుక్‌ను అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. పోలీసు వ్యవస్థకు డిసిప్లిన్, డిగ్నిటీ, ఇంటిగ్రిటీ ఉండాలని, అయితే కొందరు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వం చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా అమలు చేస్తున్నారని ఆక్షేపించారు. దీని వల్ల పోలీసు వ్యవస్థ డిసెన్సీ, డిగ్నిటీ దిగజారిపోతోందని గోరంట్ల మాధవ్ అన్నారు.
ఇదీ చదవండి: కన్నీటితో చంద్రబాబు సర్కార్‌కు హెచ్చరిక


