సాక్షి,హైదరాబాద్ : అభివృద్ధి ఎలా చేయాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హితవు పలికారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. సభలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై ఈ కమిటీ విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి ఆయన కోరిన గడువు, వీడియో ఫుటేజీల అంశాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.
ఎథిక్స్ కమిటీ విచారణకు హాజరయ్యే క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కేసీఆర్ కట్టిన కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లను ఎవరూ చెరపలేరు. కేసీఆర్ కట్టిన బిల్డింగ్‌ల ముందు ‘కాంగ్రెస్ తల్లి’ విగ్రహాన్ని పెట్టి రిబ్బన్ కట్ చేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఆ కాంగ్రెస్ తల్లిని గాంధీభవన్‌కు పార్శిల్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కటింగ్ సీఎంగానే మిగిలిపోతారు. కరీంనగర్‌లో రూపాయి ఖర్చు పెట్టకుండా రేవంత్ రెడ్డి ఓపెనింగ్‌లు చేస్తున్నారు.
సిరిసిల్ల నుంచి జనం రాకపోతే, పక్క జిల్లాల నుంచి కాంగ్రెస్ సభకు జనాలను తరలిస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధిలో కనీసం సగమైనా కొడంగల్‌లో రేవంత్ రెడ్డి చేసి చూపించాలి. కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూసైనా సీఎం నేర్చుకోవాలి. 2009 నుంచి కేటీఆర్‌కు ఓటమి తెలియదు.. కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి అసలు పోటీ కానేకాదు. కరీంనగర్ జిల్లా రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. నా హుజురాబాద్ నియోజకవర్గ దళితులకు రెండో విడత రైతు బంధు అందించాలి. అలాగే నా నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు ప్రకటించాలని సీఎంను కోరుతున్నా’ అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.


