సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పిందని వచ్చిన వార్తల్ని ఎయిర్‌పోర్ట్ అధికారులు ఖండించారు. బుధవారం విజయవాడ వెళ్తున్న ఓ విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశారంటూ కథనాలు వెలువడడంపై అధికారులు ఓ ప్రకటనలో స్పందించారు.
బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తిందని, దీనిని గుర్తించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని అప్రమత్తం చేసి విమానాన్ని వెనక్కి మళ్లించి శంషాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారని ఆ కథనాలు వెల్లడించాయి.
ఎయిర్‌పోర్టు పీఆర్వో ఖండన
అయితే, ఈ వార్తలపై శంషాబాద్ ఎయిర్‌పోర్టు పీఆర్వో తాజాగా స్పష్టతనిచ్చారు. ఈ కథనాల్లో పేర్కొన్నట్లుగా ఈరోజు ఎయిర్‌పోర్టులో ఎలాంటి అత్యవసర ల్యాండింగ్ జరగలేదని, ఈ సమాచారం పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు. ప్రయాణికులు, ప్రజలు ఎవరూ కూడా ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.
ఇదీ చదవండి: షాకిచ్చిన టీవీకే.. ఏకంగా దుకాణం బంద్


