ఆదాయంలో వెలుగు.. హక్కుల చీకటి
వలస కార్మికులను అక్కున చేర్చుకుంటున్న కర్ణాటక, తమిళనాడు, కేరళ
86.4 శాతం మందికి భరోసా లేని ఉపాధే
దాదాపు 58 శాతం మందికి నగదు రూపంలోనే వేతనాలు
దక్షిణ భారత అంతర్ రాష్ట్ర వలస కార్మికుల సర్వే–2026 నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: సొంతూరిలో పనిలేక పొట్ట చేతపట్టుకుని ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాల కార్మికులు దక్షిణాది బాట పట్టారు. ఇక్కడికి వచ్చాక వారి ఆదాయం పెరిగింది. జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. కానీ.. ప్రభుత్వ పథకాలు.. వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఆదాయం సంతృప్తిగా ఉన్నా ఉద్యోగంలో భద్రత లేదు. దక్షిణాది రాష్ట్రాలకు వలస వచ్చిన కార్మికుల జీవన పరిస్థితులపై దక్షిణ భారత అంతర్ రాష్ట్ర వలస కార్మికుల సర్వే–2026 (ఎస్‌ఐఐఎంఎస్) వలసతో బతుకులో వెలుగు కనిపిస్తున్నా.. హక్కులు, సంక్షేమం విషయంలో అంతంతమాత్రంగానే ఉందని వెల్లడించింది.
అంతర్జాతీయ వలసలు–అభివృద్ధి సంస్థ (ఐఐఎంఏడీ) ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) సహకారంతో అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) భాగస్వామ్యంతో 2026లో నిర్వహించిన ఈ సర్వే నివేదికను ఇటీవల (ఈ నెల 28న) విడుదల చేశారు. కర్ణాటక, తమిళనాడు, కేరళలోని 33 జిల్లాల్లో 1,824 మంది వలస కార్మికులు సర్వేలో పాల్గొన్నట్టు నివేదిక వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 72 శాతం మంది వలస వచ్చిన తర్వాత జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పినట్టు పేర్కొంది. వీరిలో సగం మందికి పైగా ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించింది.
ఉత్తర, తూర్పు రాష్ట్రాల నుంచే అధికం
కర్ణాటక, తమిళనాడు, కేరళకు వచ్చిన కార్మికుల్లో ఎక్కువ మంది ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాలకు చెందినవారే ఉన్నట్టు గుర్తించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 92 శాతానికి పైగా మంది పశ్చిమ బెంగాల్ (26.2%), బిహార్ (21.8%), అసోం (17.1%), ఒడిశా (12%), ఉత్తరప్రదేశ్ (9.6%), జార్ఖండ్ (5.6%) రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఉన్నారు. వలస వచ్చిన వారు వ్యవసాయం, చేపల వేట, సముద్ర ఆధారిత పనులు, రోజువారీ కూలి పనులు, హోటళ్లు–ఆతిథ్య రంగం, వస్త్ర–దుస్తుల తయారీ, వ్యర్థాల సేకరణ వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. కేరళ హోటళ్ల రంగంలో ఉపాధి కల్పిస్తుండగా.. తమిళనాడు వస్త్ర–దుస్తుల రంగంలోను, కర్ణాటకలో వ్యర్థాల సేకరణ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించినట్టు సర్వే గుర్తించింది.
పథకాల కోసం పడిగాపులు
వలస కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలో సమస్యలు కొనసాగుతున్నాయని సర్వే తేల్చింది. వలస కార్మికుల్లో కేవలం 19.4 శాతం మందికి మాత్రమే సంక్షేమ ప్రయోజనాలు సులభంగా అందుతున్నాయి. 35.3 శాతం మందికి పాక్షికంగా మాత్రమే అందుతుండగా.. 45.3 శాతం మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. మొత్తంగా 73.3 శాతం మంది సంక్షేమ పథకాలు, సేవలు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు.
వైద్య సేవలు తీసికట్టు.. ఉద్యోగానికి భరోసా నిల్
వలస కార్మికుల పరిస్థితి వైద్య సేవల విషయంలోనూ ఆందోళనకరంగానే ఉంది. 69.2 శాతం మంది ఆరోగ్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. వలస కార్మికుల ఉద్యోగ పరిస్థితులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. 86.4 శాతం మందికి రాతపూర్వక ఉద్యోగ ఒప్పందం లేదు. దాదాపు 58 శాతం మందికి వేతనాలు నగదు రూపంలోనే అందుతున్నాయి. సర్వేలో పాల్గొన్న కార్మికుల సగటు నెలవారీ ఆదాయం రూ.17,640గా నమోదైంది. సగటున రోజుకు 9.87 గంటలు పనిచేస్తున్నట్టు నివేదిక తెలిపింది. మహిళా కార్మికులు పురుషుల కంటే నెలకు సగటున రూ.3,313 తక్కువగా సంపాదిస్తున్నట్టు పేర్కొంది.
ఉపాధి కోసం.. ఆర్థిక భద్రత కోసం
సొంత రాష్ట్రాల్లో తక్కువ వేతనాలు, ఉద్యోగ అవకాశాల కొరత, నిరుద్యోగం, పని స్థిరంగా లేకపోవడం, పేదరికం, అప్పులు వంటి కారణాలతో కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నట్టు వెల్లడైంది. చాలా మంది ఎక్కువ సంపాదన కోసమే కాకుండా కుటుంబ ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు కూడా వలస బాటపడుతున్నారని సర్వే చెబుతోంది.
సూచనలు ఇవీ
వలస కార్మికులకు ప్రయోజనాలు సులభంగా అందేలా ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ విధానాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని అధ్యయనం సూచించింది. స్థానిక భాషల్లో సహాయక కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. వేతనాలు సకాలంలో అందేలా పర్యవేక్షణ పెంచడం, పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు బలోపేతం చేయడం, ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం, కార్మికుల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచాలని సిఫారసు చేసింది. వలసతో జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నా.. సంక్షేమం, వైద్యం, ఉద్యోగ భద్రత విషయంలో మాత్రం కార్మికులకు పూర్తిస్థాయి అండ అవసరమని ఈ సర్వే స్పష్టం చేసింది.


