ప్రమోషన్‌పై నంద్యాల జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ప్రభాకర్‌రెడ్డిని నియమిస్తూ బుధవారం ఉదయం వైద్య శాఖ ఇచ్చిన జీవో
నంద్యాల ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి నియామకం నిలిపివేత
బుధవారం ఉదయం నియామకం
టీడీపీ నుంచి సీఎంవోకు ఫిర్యాదులు రావడంతో సాయంత్రం నిలిపివేత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు తారస్థాయికి చేరుతున్నాయి. హక్కుల కోసం శాంతియుతంగా నిరసనలు తెలిపిన ప్రభుత్వ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడింది. సచివాలయ ఉద్యోగులపై పోలీస్ కేసులు, సస్పెన్షన్లతో వేధిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ వైద్యుల పైనా ప్రతాపం చూపిస్తోంది. ప్రముఖ కార్డియో వాస్కులర్ సర్జన్ (సీటీవీఎస్) డాక్టర్ ప్రభాకర్‌రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఆయనకు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి, కొన్ని గంటల్లోనే ఆ నియామకాన్ని నిలిపివేసింది. కర్నూలు జీజీహెచ్‌లో ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తున్న ప్రభాకర్‌రెడ్డికి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ)గా ప్రమోషన్ లభించింది.
పదోన్నతిపై ఆయన్ని నంద్యాల జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ బుధవారం ఉదయం వైద్య శాఖ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే ఆయన నియామకాన్ని తప్పుబడుతూ ఎల్లో మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను టీడీపీ సోషిల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు, సీఎంవోకు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. దీంతో ప్రభాకర్‌రెడ్డి నియామకాన్ని నిలిపివేయాలని సీఎంవో నుంచి వైద్య శాఖకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ ఆదేశాల ఆధారంగా బుధవారం సాయంత్రానికే వైద్య శాఖ ప్రభాకర్‌రెడ్డి నియామకాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇప్పుడీ అంశం వైద్య శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రమోషన్‌పై 9 మంది వైద్యులకు పోస్టింగ్‌లు ఇచ్చి, వారిలో కేవలం ప్రభాకర్‌రెడ్డి నియామకాన్ని మాత్రమే నిలిపివేయడం బాబు సర్కారు కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతోంది. ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లోని వైద్యులు చేతులెత్తేసిన క్లిష్టమైన గుండె ఆపరేషన్లను సైతం విజయవంతంగా నిర్వహించి ప్రభాకర్‌రెడ్డి వేల మంది ప్రాణాలను కాపాడారు. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ సర్వీసులో హైదరాబాద్ గాంధీ, వైజాగ్ కేజీహెచ్, కర్నూలు జీజీహెచ్‌లలో 4 వేల గుండె ఆపరేషన్లు చేశారు. అంతటి సీనియర్ వైద్యుడిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడాన్ని వైద్య వర్గాలతో పాటు మేధావి వర్గాలు తప్పు పడుతున్నాయి.


