కొత్తవి లేవు.. ఉన్న వాటిలోనూ కోత! | Applications accepted after two years for granting new pensions | Sakshi
Sakshi News home page

కొత్తవి లేవు.. ఉన్న వాటిలోనూ కోత!

Oct 1 2026 5:42 AM | Updated on Oct 1 2026 5:42 AM

Applications accepted after two years for granting new pensions

కొత్త పింఛన్ల మంజూరుకు రెండేళ్ల తర్వాత దరఖాస్తుల స్వీకరణ

కేవలం 9 రోజుల గడువులో 13.66 లక్షల మంది దరఖాస్తు

అక్టోబర్‌ 1 నుంచే పింఛన్‌ డబ్బులు పంపిణీ అంటూ ప్రచారం

తీరా పరిశీలన పేరిట కాలయాపనకు ఎత్తుగడ

కొత్తగా ఒక్క పింఛన్‌ మంజూరు లేకపోయినా గత నెల కంటే తగ్గిపోయిన పంపిణీ మొత్తం 

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీనెలా కోతలే

గత ప్రభుత్వంతో పోలిస్తే ఏకంగా 6.42 లక్షల పింఛన్లు తగ్గుదల

ఎప్పుడో మంజూరై, ఏళ్ల తరబడి ప్రతీనెలా వృద్ధాప్య పింఛను డబ్బులు తీసుకుంటున్న గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాల వారి పాలెం గ్రామానికి చెందిన కుర్రా రుక్మిణమ్మ పింఛన్‌ను కూటమి ప్రభుత్వం 2025 జూన్‌లో అర్ధంతరంగా నిలిపివేసింది. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా పింఛన్లు రద్దు చేశారంటూ భర్త పద్మారావుతో కలిసి ఆమె ఏడాదిన్నరగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ ఏడాది మే నెలలో గుంటూరు జిల్లా కలెక్టర్‌.. రుక్మిణమ్మ వృద్ధాప్య పింఛను పునరుద్ధరించాలంటూ సిఫార్సు చేయడంతో  ఈమె గత 11 నెలల బకాయిలు పొందేందుకు అర్హురాలని పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇది జరిగి నాలుగు నెలలైనా వారు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వం అక్టోబర్‌లో కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. పైగా పాత పింఛన్లకు గత నెలలో విడుదల చేసిన నిధుల కంటే తక్కువగా మంజూరు చేస్తూ.. అంటే కోత పెడుతూ అక్టోబర్‌ 1 (గురువారం)న పంపిణీ చేసేందుకు సచివాలయాల వారీగా నిధులు విడుదల చేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు కొత్తగా పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులు స్వీకరించే ఆన్‌లైన్‌ పోర్టల్‌ను పూర్తిగా మూసేసిన విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లో కేవలం తొమ్మిది రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణకు వీలు కల్పించింది. 

మళ్లీ అవకాశం వస్తుందో రాదో అన్నట్టు అర్హులు ఆపసోపాలు పడుతూ ఆఫీసులు చూట్టూ తిరిగి ఆ తక్కువ సమయంలోనే ఏకంగా 13.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో అక్టోబర్‌ 1వ తేదీ నాటికే కొత్త పింఛన్లు మంజూరు చేసి.. డబ్బులు కూడా పంపిణీ చేస్తారని టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం చేశారు. అయితే, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టడానికే రెండేళ్ల నాలుగు (28) నెలలు గడువు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఆయా దరఖాస్తుల పరిశీలన అంటూ మరికొంత కాలం కాలయాపన చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

నెలనెలా పింఛన్ల నిధుల్లో కోత
కొత్త పింఛన్ల సంగతి అలా ఉంచితే, పాత పింఛన్లకూ చంద్రబాబు ప్రభుత్వం ప్రతి నెలా కోతలు పెడుతూనే ఉంది. నెలనెలా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం మంజూరు చేసే నిధుల మొత్తం తగ్గిపోతూనే ఉంది. గత సెప్టెంబర్‌ 1న పంపిణీకి విడుదల చేసిన నిధుల కన్నా, ఈ అక్టోబర్‌ 1న  పంపిణీ చేసే నిధులు తగ్గిపోయాయి. గత 28 నెలలుగా ప్రతి నెలా నాలుగైదు కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి విడుదల చేసిన మొత్తం తగ్గిపోతూనే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏడాది క్రితం 2025 ఆగస్టులో పింఛన్ల పంపిణీకి విడుదల చేసిన నిధులు మొత్తం కన్నా, అక్టోబర్‌లో పంపిణీకి విడుదల చేసిన మొత్తం దాదాపు రూ.58 కోట్లు తక్కువగా ఉండడం గమనార్హం.

పింఛన్ల సంఖ్యలో 6.42 లక్షలు తగ్గుదల
గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో (ఇప్పుడు మన రాష్ట్రంలో ఇస్తున్న సంఖ్య కంటే చాలా ఎక్కువ) లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్ధిదారులు పింఛను పొందారు. తర్వాత కాలంలో పెన్షన్ల సంఖ్య సాధారణంగా పెరగాలి. కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల రెండు నెలల తర్వాత కూడా ఈ సంఖ్య చాలా తక్కువగానే ఉంది.

 సెప్టెంబర్‌ 1 నుంచి 3వ తేదీ మధ్య రాష్ట్రంలో జరిగిన పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కేవలం 59,91,857 మంది లబ్ధిదారులకు మాత్రమే డబ్బులు పంపిణీ చేసింది. అంటే దాదాపు గత ప్రభుత్వంలో గరిష్ట పింఛన్ల సంఖ్య కన్నా ప్రస్తుతం 6.42 లక్షల పింఛన్ల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. మరో వైపు 2019–24 మధ్య ఆ ఐదేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం 29.51 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అప్పట్లో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement