నీటి లభ్యతపై ఆరా తీస్తున్న శైలజానాథ్
రెండువారాల్లో నీరివ్వకపోతే కార్యాలయాలు ముట్టడిస్తాం
వైఎస్సార్‌సీపీ నేత శైలజానాథ్
నేతలు, రైతులు మిడ్ పెన్నార్ డ్యామ్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
శింగనమల/గార్లదిన్నె: తుంగభద్ర జలాశయం నుంచి మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్)కు కేటాయించిన నీళ్లను తక్షణమే వదలాలని వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీమంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. నీటి విడుదలలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా ఎందుకు వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. రెండువారాల్లోపు దక్షిణ కాలువకు నీరు విడుదల చేయకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, పార్టీ గార్లదిన్నె మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో వామపక్ష నాయకులు, రైతులతో కలిసి శైలజానాథ్ బుధవారం చేపట్టిన మిడ్ పెన్నార్ డ్యామ్ పరిశీలన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఈఈకి ఫోన్‌చేసి మాట్లాడినా.. అదే మాట చెప్పడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ డ్యామ్ కట్ట వీక్‌గా ఉందని, మనుషులు పోకూడదని చెబితే.. ఇక నీళ్లు ఏ విధంగా నిల్వచేస్తారని మండిపడ్డారు. ‘ప్రస్తుతం డ్యామ్‌లో 1.3 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెబుతున్నారు. వాస్తవానికి ఈపాటికి డ్యామ్‌లో 4 టీఎంసీల నీరు ఉండాలి. హెడ్‌కు రావాలంటే కనీసం 2 టీఎంసీల నీరు నిల్వ ఉండాలి. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి నీళ్లుపోతున్నాయి.
ఈ ప్రాంతానికి మాత్రం వదలడం లేదు’ అని చెప్పారు. వారం, పదిరోజుల్లో కాలువలకు నీరు వదలకపోతే పంటలు నిలువునా ఎండిపోతాయని, మనుషులతో పాటు మూగజీవాలు తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామిరెడ్డి పాల్గొన్నారు.


