స్వయంశక్తి
‘యాభై లక్షలతో వ్యాపారమా? రిస్క్ చేస్తున్నావు. వ్యాపారంలో మగవాళ్లే అష్టకష్టాలు పడుతుంటారు. మనకు చాలా కష్టం’ అన్నారు కొందరు.ఆ మాటలు విని శరణ్య వెనకడుగు వేయలేదు.
‘రిస్క్ తీసుకోకపోవడం అనేది పెద్ద రిస్క్’ అనే సరదా సామెత ఆమెకు తెలియనిదేమీ కాదు!అందుకే... ధెర్యంగా ముందడుగు వేసింది.
ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనేది ఆమె స్వ΄్నాన్ని ‘మధుర పప్పు దినుసులు’ బ్రాండ్‌తో సాకారం చేసుకుంది.
యాభై లక్షల రూపాయల పెట్టుబడితో ‘దాల్ మిల్’్రపారంభించి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన కట్ట శరణ్య...
‘ఎలాగైనా సరే, ఏదో ఒకటి అయినా సరే... వ్యాపారం ప్రారంభించాలి’ అనుకుంటే, ఆ తొందరలో నష్టాలు ‘హాయ్’ చెబుతాయి. ఆలస్యమైనా సరే, ఆలోచించి వ్యాపారంలోకి దిగాలనుకుంది శరణ్య. రకరకాలుగా ఆలోచించిన తరువాత ఆమె దృష్టి పప్పుల మీద పడింది. స్థానికంగా పప్పు దినుసులకు ఉన్న డిమాండ్‌ను గుర్తించిన శరణ్య నేరుగా రైతుల దగ్గరి నుంచి పంటను సేకరించి నాణ్యమైన పప్పులను తయారు చేయాలని సంకల్పించింది.
పీఎంఈజీపీ (ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం) కింద 35 శాతం సబ్సిడీతో రూ. 50 లక్షల ప్రాజెక్ట్ వ్యయంతో గొల్లపల్లి మండల కేంద్రంలో ‘మల్లికార్జున దాల్ మిల్’ను ఏర్పాటు చేసింది. అత్యుత్తమ సాంకేతికత కలిగిన మైక్రో ప్లాంట్, 30 హెచ్‌పీ సామర్థ్యం గల మోటారుతో ఈ మిల్లును తీర్చిదిద్దింది. ఎక్కడా కల్తీకి తావులేకుండా, కెమికల్స్ వాడకుండా 100 శాతం స్వచ్ఛమైన పప్పులను తయారు చేయడమే లక్ష్యం చేసుకుంది. తాను తయారు చేసే ఉత్పత్తులకు ‘మధుర పప్పు దినుసులు’ అని నామకరణం చేసింది.
‘ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని, ధైర్యంగా ముందడుగు వేస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరు. నాణ్యతలో రాజీ పడకుండా వినియోగదారులకు స్వచ్ఛమైన పప్పు దినుసులు అందించడమే మా ప్రధాన ఉద్దేశం‘ అంటుంది కట్టా శరణ్య.
– బొమ్మెన కుమార్, సాక్షి, గొల్లపల్లి


