బీర సత్యకుమారి, గొల్లపల్లి అమూల్య
సాక్షి, అమలాపురం(కోనసీమ ): సీనియారిటీ ఒకవైపు.. కొత్తగా వచ్చిన వారు మరోవైపు. ప్రజాప్రతినిధుల మద్దతు ఒకరికి.. పార్టీ ముఖ్య నాయకుల అండదండలు మరొకరికి. వెరసి కోనసీమలో కొత్తగా ఏర్పాటైన తొలి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 20న ఈ ఎన్నిక నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో టీడీపీలో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి.
చైర్‌పర్సన్ రేసులో ఐ.పోలవరం, మామిడికుదురు జెడ్పీటీసీ సభ్యులు బీర సత్యకుమారి, గొల్లపల్లి అమూల్య పేర్లు ప్రధానంగా తెర పైకి రావడంతో సీనియర్ వర్సెస్ జూనియర్ అనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. సత్యకుమారి.. అమూల్య ఇద్దరూ జెడ్పీ చైర్‌పర్సన్ పదవి కోసం చేస్తున్న పైరవీలు టీడీపీలో వర్గపోరుకు కారణమవుతున్నాయి. విషయం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వర్సెస్ నాయకులు అన్నట్టుగా మారింది.
సీనియారిటీ కోటాలో..
సత్యకుమారి టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో పని చేస్తున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం తొలుత ఆమె పేరును ప్రకటించి బీ ఫారం కూడా అందించింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ బీ ఫారాన్ని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద భార్య శేషుకుమారికి కేటాయించారు. దీంతో, ఎమ్మెల్యే కావాలన్న సత్యకుమారి ఆశ నెరవేరలేదు. ఆ తర్వాత కూడా ఆమె ఆ పార్టీని వీడలేదు. ఐ.పోలవరం ఎంపీపీగా, 2021లో కేశనకుర్రు సర్పంచ్‌గా పని చేశారు.
ప్రస్తుతం ఐ.పోలవరం జెడ్పీటీసీగా గెలుపొందారు. జెడ్పీ చైర్‌పర్సన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఈసారి ఆమె ఈ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. ఆమెకు అదే మండలానికి చెందిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ గంటి హరీష్ మాధుర్‌తో పాటు మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే ఐ.పోలవరం మండలానికి కీలక పదవులు రావడంతో సత్యకుమారి కూడా అవకాశం ఇస్తారా, లేదా అనేది చూడాల్సి ఉంది.
కీలక నేతల అండతో..
మరోవైపు టీడీపీ రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న గొల్లపల్లి అమూల్య ఇటీవలే ఆ పార్టీలో చేరారు. ఆమెకు స్థానికంగా ద్వితీయ శ్రేణి నాయకుల మద్దతు ఉంది. కానీ, సత్యకుమారితో పోలిస్తే మాత్రం జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధుల మద్దతు పెద్దగా లేదు. అయితే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజులు అమూల్యకు జెడ్పీ పీఠం దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల పి.గన్నవరం, రామచంద్రపురం నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ ఈ దిశగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
బొబ్బిలి ఎమ్మెల్యే, టీడీపీ రీజినల్ కో ఆర్డినేటర్ ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీ నాయన) సమక్షంలో ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. అమూల్య జెడ్పీటీసీగా గెలిచిన మామిడికుదురు మండలం రాజోలు, పి.గన్నవరం రెండు నియోజకవర్గాల పరిధిలో ఉంది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నందున టీడీపీకి చెందిన అమూల్యకు జెడ్పీ చైర్‌పర్సన్ పదవి కేటాయించాలనే వాదన ఉంది.
2014లోనూ ఇదే తరహా పోటీ
ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ చైర్మన్ పదవి కోసం 2014లోనూ టీడీపీలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. అప్పట్లో జెడ్పీ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించారు. దీంతో, ఐ.పోలవరం నుంచి జెడ్పీటీసీగా గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మామిడికుదురు నుంచి జెడ్పీటీసీగా ఎన్నికైన నామన రాంబాబు మధ్య పోటీ నెలకొంది. చివరకు సీనియర్ కోటాలో పీఠం నామన రాంబాబును వరించింది.
ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత అదే ఐ.పోలవరం, మామిడికుదురు మండలాల మధ్య మరోసారి జెడ్పీ పీఠం కోసం పోటీ నెలకొనడం విశేషం. అప్పట్లో ఉమ్మడి జిల్లా పరిధిలో చైర్మన్ పదవి జనరల్‌కు రిజర్వ్ కాగా.. ఇప్పుడు కోనసీమ జిల్లా పరిధిలో ఎస్సీ మహిళకు కేటాయించారు.


