ఒక్క కాగితం ముక్కతో నీ సంగతి తేలుస్తా.. | Narasaraopet TDP Leaders Internal Fight | Sakshi
Sakshi News home page

ఒక్క కాగితం ముక్కతో నీ సంగతి తేలుస్తా..

Nov 12 2026 8:16 AM | Updated on Nov 12 2026 8:19 AM

Narasaraopet TDP Leaders Internal Fight

కపిలవాయి విజయకుమార్‌ , నాగసరపు సుబ్బరాయ గుప్తా

పల్నాడు:  నరసరావుపేట మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు టీడీపీకి చెందిన కపిలవాయి విజయకుమార్, మాజీ చైర్మన్‌ నాగసరపు సుబ్బరాయ గుప్తా పోటీ పడుతున్నారు. తొలుత సుబ్బరాయ గుప్తా పేరును ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ఆర్యవైశ్య సంఘ సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అయితే, పార్టీలోని ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో అభ్యర్థి ఎంపికపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. చైర్మన్‌ అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా సర్వే నిర్వహించి నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించింది. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందన్న ఉత్కంఠ కంటే, ఎవరి బలం ఎంత అన్న ఆధిపత్య పోరే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. 

నీ కథ అంతా బయటపెడతా.. 
విజయకుమార్‌ను లక్ష్యంగా చేసుకుని గుప్తా వర్గం పలు పాత వివాదాలను తెరపైకి తీసుకొస్తోంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు దోపిడీ కేసులో దొంగ బంగారం కొనుగోలు చేశారనే ఆరోపణలు, సఖ్యత ఎలక్ట్రానిక్స్‌ నిర్వాహకులు స్కీమ్‌లు, అధిక వడ్డీల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి దివాలా తీసిన వ్యవహారంలో ఆ భవనాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేశారనే విమర్శలను ప్రచారంలోకి తెస్తున్నారు. అంతేకాకుండా, గుంటూరులోని ఆయన అల్లుడి వైద్యశాలకు సంబంధించి గతంలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్‌ కేసులో విజయకుమార్‌ పేరు వచ్చిందని, ఈ వ్యవహారంలో జైలుకు కూడా వెళ్లివచ్చారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశాలన్నీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

పరువు తీయొద్దంటూ ఆవేదన.. 
ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ప్రముఖులు పదవి కోసం పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ బహిరంగంగా విమర్శించుకోవడంపై ఆర్యవైశ్య వర్గంలోని కొందరు ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక వర్గ ప్రతిష్ఠను బహిరంగ చర్చకు ఈడ్చవద్దంటూ హితవు పలుకుతున్నారు. సామాజిక వర్గ పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చాలని కోరుతున్నారు.  

తెరవెనుక ప్రజాప్రతినిధులు 
ఈ ఆధిపత్య పోరులో స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు కూడా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మద్దతు సుబ్బరాయ గుప్తాకు ఉండగా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం విజయకుమార్‌కు మద్దతు ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గుప్తా నిర్వహించిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరవుతుండగా, ఎంపీ దూరంగా ఉంటున్నారనే చర్చ ఉంది. మరోవైపు, విజయకుమార్‌ నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ హాజరుకావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. పార్టీ పెద్దల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ వివాదానికి కారణమా? లేక చైర్మన్‌ అభ్యర్థి ఎంపికలో ఆధిపత్యం కోసం జరుగుతున్న అంతర్గత రాజకీయమా? అనేది టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాసేవకు ప్రతీకగా ఉండాల్సిన పదవి కోసం వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతుండటంపై పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి టీడీపీ సీటు ఇవ్వనుందనే ప్రచారంపై అసహనం వ్యక్తం 
అవుతోంది.  

 ఒక్క కాగితం ముక్కతో నీ సంగతి తేలుస్తా.. 
ఒక్క కాగితం ముక్క బయటపెడితే ఎదుటివారి జీవితం తలకిందులవుతుందంటూ పరోక్షంగా గుప్తాను ఉద్దేశించి విజయకుమార్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. దేవాలయ ఆస్తుల అన్యాక్రాంతం, నరసరావుపేట జమీందారు సేవాదృక్పథంతో అందించిన కళాశాల ఆస్తుల విక్రయాలు, విరాళాలతో నిర్మించిన కల్యాణ మండపం నిధుల లెక్కల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలను ప్రచారంలోకి తెస్తున్నారు. ఆలయ ఆస్తుల అద్దెల గోల్‌మాల్‌ వంటి విమర్శలు చేస్తున్నారు. గతంలో పేకాట వ్యవహారంలో పోలీసులకు పట్టుబడ్డారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement