ప్రజారోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా..? | High Court questions Chandrababu govt over incident involving adverse reaction to malaria pills | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా..?

Nov 12 2026 5:58 AM | Updated on Nov 12 2026 5:58 AM

High Court questions Chandrababu govt over incident involving adverse reaction to malaria pills

బాలిక మృతి, 53 మంది అస్వస్థతను తేలిగ్గా తీసుకుంటారా?

మలేరియా మాత్రలు వికటించిన ఘటనపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేసిన తీరుపై ఆగ్రహం

డీఎస్పీ స్థాయి అధికారి చేయాల్సిన పనిని ఎస్‌ఐ ఎలా చేస్తారు? 

ఎస్‌ఐ దాఖలు చేసిన రిపోర్ట్‌లోనూ సరైన వివరాలు లేవు

ఎక్స్‌పర్ట్‌ వైద్య నివేదిక, ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఊసే లేదు

ఇవన్నీ చూస్తే ఘటనపై ప్రభుత్వ సీరియస్‌నెస్‌ అర్థమవుతోంది

ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై 10 రోజుల్లో అఫిడవిట్‌ వేయండి

రాష్ట్ర ప్రభుత్వానికి సీజే ధర్మాసనం ఆదేశం

సాక్షి, అమరావతి: పోలవరం జిల్లా, ఎటపాక మండలం, గొల్లగూపు గ్రామంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 1న మలేరియా మాత్రలు వికటించి ఎం.జమున అనే ఏడేళ్ల బాలిక మృతి చెందడంతో పాటు 53 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఓ ఎస్‌ఐ స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. కనీసం డీఎస్‌పీ స్థాయి అధికారి స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేయాల్సి ఉండగా, ఓ ఎస్‌ఐ నివేదిక దాఖలు చేశారంటే, ఈ మొత్తం ఘటన విషయంలో ప్రభుత్వానికి ఉన్న సీరియస్‌నెస్‌ ఏంటో అర్థమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. 

ఎస్‌ఐ దాఖలు చేసిన స్టేటస్‌ రిపోర్ట్‌లో కూడా బాలిక మృతికి దారి తీసిన పరిస్థితులు, అం­దుకు సంబంధించిన ఆధారాల సేకరణ వంటి  అవసరమైన వివరాలేవీ లేవని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతోపాటు ఘటనపై పూర్తి వివరాలతో 10 రోజుల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పోలవరం జిల్లా ఎస్‌పీ, జిల్లా వైద్య అధికారిని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా జిల్లా ఎస్‌పీ, వైద్య అధికారిని ప్రతివాదులుగా చేర్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి చల్లా గుణరంజన్‌ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మృతురాలి వైద్య రికార్డులు పరిశీలించలేదు
మాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు కొన్నారు.. ఎక్కడ తయారయ్యాయి.. ఎప్పు­డు తయారయ్యాయి.. వంటి వివరాలేవీ స్టేటస్‌ రిపోర్ట్‌లో లేవు.  ఎక్స్‌పర్ట్‌ మెడికల్‌ నివేదికను కూడా తీసుకోలేదు. మృతురాలి వైద్య రికార్డులు కూడా పరిశీలించలేదు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ రిపోర్ట్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) కూడా లేదు.  ఈ వివరాలేవీ లేకుండా స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేశారు.  ఇంతటి ముఖ్యమైన వ్యవహారాన్ని అలా ఎలా తేలిగ్గా తీసుకుంటారు?   – ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ప్రశ్న

విచారణ జరపాలని హైకోర్టుకు పంపిన సుప్రీంకోర్టు
ఈ ఘటనపై తెలంగాణకు చెందిన నల్లపు మణిదీప్‌ అనే న్యాయవాది సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. దీంతో ఈ వ్యాజ్యంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ వ్యాజ్యం గత నెలాఖరున విచారణకు రాగా, సీనియర్‌ న్యాయవాది ఎ.ఛాయాదేవిని కోర్టు సహాయకారి (అమికస్‌ క్యూరీ)గా నియమిస్తూ సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement