సజావుగా జరిగితే ప్రభంజనమే | YS Jagan held discussions with leaders from several districts regarding local elections | Sakshi
Sakshi News home page

సజావుగా జరిగితే ప్రభంజనమే

Nov 12 2026 5:38 AM | Updated on Nov 12 2026 5:38 AM

YS Jagan held discussions with leaders from several districts regarding local elections

పార్టీ నాయకులతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకత బయటపడుతుందనే చంద్రబాబు అరాచకాలు

స్థానిక ఎన్నికలు జరిగిన తీరుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం

అక్రమాలన్నీ దాటుకుని వైఎస్సార్‌సీపీ ఓటింగ్‌ పెరిగింది

నిష్పక్షపాతంగా జరిగి ఉంటే.. వైఎస్సార్‌సీపీకి ఓట్ల శాతం మరింత భారీగా ఉండేది

వైఎస్సార్‌సీపీ విజయాలు సాధించిన చోట కూడా అక్రమాలకు పాల్పడి ఫలితాలు తారుమారు చేశారు

ఎన్నికల అక్రమాల్లో బాబు  సరికొత్త ఆవిష్కరణలు

ఇన్ని దుర్మార్గాలు చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరుతో నీతుల

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అంతా కసితో గట్టిగా పోరాటం చేశారు

ప్రతికూల పరిస్థితుల్లోనూ కార్యకర్తల పోరాటం అభినందనీయం

స్థానిక ఎన్నికలపై పలు జిల్లాలకు చెందిన నాయకులతో చర్చించిన వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు సాగించిన అక్రమాలను ప్రజలంతా గమనించారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 2024 ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ఓటింగ్‌ శాతం పెరిగిందని, అడుగడుగునా అధికార దుర్వినియోగం, దాడులు, అక్రమాలు చోటు చేసుకున్నప్పటికీ ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారని చెప్పారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగి ఉంటే పార్టీకి మరింత భారీగా ఓట్ల శాతం నమోదయ్యేదని వెల్లడించారు. 

ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత బయటపడితే తన ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే భయంతోనే చంద్రబాబు ఎన్నికల ప్రక్రియను అక్రమాలమయం చేశారని మండిపడ్డారు. ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త ఆవిష్కరణలకు తెరతీశారని ఘాటుగా విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పలు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు వైఎస్‌ జగన్‌ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు, అధికార పార్టీ సాగించిన అక్రమాలు, కౌంటింగ్‌లో జరిగిన అవకతవకలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

కిడ్నాప్‌లు.. బెదిరింపులు.. కౌంటింగ్‌లో అక్రమాలు
తమ రాజకీయ జీవితాల్లో  ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలను ఎప్పుడూ చూడలేదని పార్టీ నాయకులు జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్ల స్థానంలో బౌన్సర్లను పెట్టి వ్యవహారాలను నడిపించారని ఆరోపించారు. అభ్యర్థుల బంధువులను కిడ్నాప్‌ చేసి నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తెచ్చారని తెలిపారు. 

ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లని ఓట్ల పేరుతో వైఎస్సార్‌సీపీకి వచ్చిన ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించారని, కరెంటు నిలిపివేసి ఫలితాలను తారుమారు చేశారని వివరించారు. వైఎస్సార్‌సీపీ గెలిచిన చోట పదేపదే రీకౌంటింగ్‌ నిర్వహించి లెక్కలు మార్చారని, పార్టీ కోరిన చోట మాత్రం రీకౌంటింగ్‌కు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా అదనపు బ్యాలెట్‌ పేపర్లు ఇచ్చి గెలిపించేలా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు చేయించిన దాడుల కారణంగా గ్రామగ్రామాన బాధితులు ఉన్నారని తెలిపారు.

సజావుగా జరిగితే వైఎస్సార్‌సీపీకి భారీ ఓటింగ్‌
నాయకుల ఫిర్యాదులపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశా­­రని, వాస్తవాలను అర్థం చేసుకున్నారని చెప్పా­రు. 2024 ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్‌­సీపీ ఓటింగ్‌ శాతాలు పెరిగాయని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ అరాచకాలు, అన్యాయాలు జరిగి­నా పార్టీ ఓటింగ్‌ శాతం పెరిగిందని వివరించారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీకి మరింత భారీగా ఓటింగ్‌ నమోదయ్యేదని చెప్పారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తే తన ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే భయంతోనే చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. 

అక్ర­మాలను దాటుకుని వైఎస్సార్‌సీపీ విజయాలు సాధించిన చోట కూడా ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. వైఎ­స్సార్‌సీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో అక్రమా­లు జరిగాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు తాను చేసిన అరాచ­కాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్‌ విమర్శించారు. ఇన్ని దుర్మార్గాలకు పాల్పడి ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరిట నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతికూల పరిస్థితు­ల్లోనూ పార్టీ కోసం కసితో, పట్టుదలతో పోరాడిన నాయకులను, కార్యకర్తలను అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement