13,172పంచాయతీలకు మూడుదశల్లో ఎన్నికలు
తొలిదశ ఎన్నికలు జరిగే మండలాల్లో రేపు నోటిఫికేషన్, 15 నుంచి నామినేషన్ల స్వీకరణ
సాక్షి, అమరావతి: రాజకీయ పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామం శుక్రవారం ఆరంభం కానుంది. రాష్ట్రంలోని 13,354 గ్రామ పంచాయతీల్లో.. కోర్టు చిక్కులు లేని 13,172 పంచాయతీలకు మూడుదశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. తొలిదశ ఎన్నికలకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ నోటిఫికేషన్ జారీచేయనున్నారు.
ఈ ఎన్నికలకు ఈ నెల 15వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. రెండు నుంచి నాలుగు పంచాయతీలను ఒక క్లస్టరుగా వర్గీకరించి, వాటికి ఒకేచోట నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ క్లస్టర్‌లోని పెద్ద పంచాయతీ కార్యాలయంలో ఆయా పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలిదశ ఎన్నికలు 26వ తేదీ నిర్వహిస్తారు.
రెండోదశ ఎన్నికలకు 18 నుంచి, మూడోదశకు 21 నుంచి నామినేషన్లు
రెండోదశ ఎన్నికలు జరిగే మండలాల్లో ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసి 18వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 29వ తేదీ ఎన్నికలు నిర్వహిస్తారు. మూడోదశ ఎన్నికలకు 19న నోటిఫికేషన్ జారీచేసి 21వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీ ఎన్నికలు నిర్వహిస్తారు.
4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలపై నేడు నిర్ణయం
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు ఎస్‌ఈసీ గురువారం ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మున్సిపల్‌శాఖ అధికారులను కూడా ఆహ్వానించారు. రాష్ట్రంలో 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉండగా.. తొలివిడతలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.
కోర్టు కేసుల కారణంగా తొలి విడతలో ఎన్నికలు జరగని నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణపై గురువారం జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఆ 23 చోట్ల గురువారం నోటిఫికేషన్ జారీచేసి, 26వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయాలు తీసుకోనుంది. వారు ఓకే చెప్పిన పక్షంలో గురువారమే ఆ 23 చోట్ల మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.


