వెబ్‌ల్యాండ్‌ ‘లాగిన్‌’ లూటీ కేసులో సూత్రధారులు సేఫ్‌! | Four arrested in case involving illegal alterations to Webland records | Sakshi
Sakshi News home page

వెబ్‌ల్యాండ్‌ ‘లాగిన్‌’ లూటీ కేసులో సూత్రధారులు సేఫ్‌!

Nov 12 2026 5:43 AM | Updated on Nov 12 2026 5:43 AM

Four arrested in case involving illegal alterations to Webland records

నెపమంతా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి సాయికుమార్‌పైనే 

సీసీఎల్‌ఏ సీఎంఆర్‌వో సెక్షన్‌ వైపు కన్నెత్తి చూడని దర్యాప్తు 

సెక్షన్‌ సూపరింటెండెంట్‌ పాత్రపైనా నోరు మెదపని అధికారులు 

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఇంత స్కామ్‌ నడిపాడా? 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని లక్షలాది రైతుల భూ రికార్డులకు గుండెకాయ లాంటి వెబ్‌ల్యాండ్‌లో చోటుచేసుకున్న ట్యాంపరింగ్‌ కేసు దర్యాప్తు దారితప్పింది. భూ రికార్డులను కాపాడాల్సిన చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలోని అసలు పాత్రధారులను వదిలేసి.. మొత్తం నేరాన్ని ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిపైకి నెట్టేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో అక్రమ మార్పుల కేసులో సీఐడీ మంగళవారం నలుగుర్ని అరెస్ట్‌ చేసింది. 

విజయవాడలోని నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)లో ఔట్‌సోర్సింగ్‌ జూనియర్‌ డెవలపర్‌గా పనిచేస్తున్న సాయికుమార్‌ తన సీనియర్‌ అధికారి లాగిన్‌ను వాడి డేటాబేస్‌లో నేరుగా మార్పులు చేశాడని సీఐడీ ప్రకటించింది. ఈ వ్యవహారంలో ఒక రైతు, ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, ఒక ప్రైవేట్‌ వ్యక్తి మాత్రమే ఉన్నారు. రికార్డుల బాధ్యత ఉన్న ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.  

సీఎంఆర్‌వో సెక్షన్‌ ఏం చేస్తోంది? 
సీసీఎల్‌ఏలో వెబ్‌ల్యాండ్‌ వ్యవహారాలన్నీ సీఎంఆర్‌వో (కంప్యూటరైజేషన్‌ ఆఫ్‌ ఎంఆర్‌ఓ ఆఫీసెస్‌) సెక్షన్‌ పరిధిలోనే జరుగుతాయి. ఈ సెక్షన్‌కు ఒక ఉన్నతాధికారి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. రికార్డుల మార్పులపై పర్యవేక్షణ, లాగిన్‌ల నియంత్రణ, ఎప్పటికప్పుడు ఆడిట్‌ చేయడం ఈ సెక్షన్‌ బాధ్యతలు. అలాంటిది నెలల తరబడి రికార్డులు మారుతున్నా ఈ సెక్షన్‌ పసిగట్టలేకపోయింది. కొన్ని నెలలపాటు దందా సాగుతున్నా ఈ అధికారి ఏం పట్టించుకోకపోవడం సాధారణ విషయం కాదని రెవెన్యూ వర్గాలే చర్చించుకుంటున్నాయి. 

సూపరింటెండెంట్‌ పాత్రపై మౌనం 
సీఎంఆర్‌వో సెక్షన్‌లో సూపరింటెండెంట్‌ ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని సీసీఎల్‌ఏ వర్గాల ద్వారా తెలిసింది. కడప జిల్లాలో పని చేయాల్సిన ఆయన సుదీర్ఘకాలంగా సీసీఎల్‌ఏలో అదే సెక్షన్‌లో పని చేస్తున్నారు. డిప్యూటీ తహశీల్దార్‌గా పదోన్నతి వచ్చినా వెళ్లకుండా.. జిల్లా యంత్రాంగం ఆయన్ను వెనక్కి పంపాలని కోరినా పంపకుండా.. కేవలం ఆన్‌ డ్యూటీగా చాలాకాలం నుంచి సీసీఎల్‌ఏ కార్యాలయంలోనే ఉంచారు. దీనివెనుక పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. రికార్డుల మార్పుల ఫైళ్లు, యాక్సెస్‌ వ్యవహారాలు ఆయన చేతుల మీదుగానే నడుస్తాయి.

అయినా దర్యాప్తులో ఆయన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. కనీసం ఆయనను విచారించారా అన్నదానిపైనా స్పష్టత లేదు. ఇదే కార్యాలయంలో గతంలో ఓ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిపై వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో అక్రమాలు చేశారంటూ ఆరోపణలు మోపారు. అప్పుడు కనీసం ఫిర్యాదు కూడా చేయకుండా ఆ ఉద్యోగిని వేరే చోటుకు బదిలీ చేశారు. అక్రమాలు జరిగి ఉంటే ఇప్పుడు చేసినట్టే అప్పుడూ పోలీసులకు ఫిర్యాదు చేసి స్కామ్‌ను బయటకు తీయాలి. అలా చేయకుండా కేవలం బదిలీతో సరిపెట్టారు. అంటే అప్పట్లో ఏమీ జరగకపోయినా జరిగివనట్టు హడావుడి చేసి అతన్ని బయటకు పంపారు. ఆ తర్వాతే రికార్డుల మార్పుల దందా జోరందుకున్నట్టు తెలుస్తోంది. 

ఒక్కడే ఇంత చేయగలడా? 
మార్చిన రికార్డులన్నీ ‘ఇతరులు’ కింద ఉన్న భూములవే. ఏ భూమి ఆ ఖాతాలో ఉందో, దేన్ని మార్చినా అభ్యంతరం రాదో తెలియాలంటే రెవెన్యూ రికార్డులపై లోతైన అవగాహన కావాలి. లోపలి వ్యక్తుల సహకారం లేకుండా ఆ సమాచారం బయటి వారికి చేరడం సాధ్యం కాదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని బలిపశువును చేసి కేసు మూసేసే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement