బుచ్చెయ్యపేట మండలంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం | YSRCP makes a strong comeback in AP Sarpanch elections | Sakshi
Sakshi News home page

బుచ్చెయ్యపేట మండలంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

Nov 28 2026 8:24 AM | Updated on Nov 28 2026 8:24 AM

YSRCP makes a strong comeback in AP Sarpanch elections

అల్లూరి సీతారామరాజు జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మండల ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల ప్రాదేశిక పోరులో 19 ఎంపీటీసీ స్థానాలకుగాను ఆరు దక్కించుకోగా, తాజాగా సర్పంచ్‌ ఎన్నికల్లోనూ హవా కొనసాగింది. గురువారం వెలువడిన సర్పంచ్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ఆద్యంతం గట్టి పోటీనిస్తూ ఏకంగా 12 పంచాయతీల్లో విజయ బావుటా ఎగురవేసింది. మండలంలో 35 పంచాయతీలకు గాను 12 వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. 

ముఖ్యంగా మేజర్‌ పంచాయతీ వడ్డాది, మండల కేంద్రం బుచ్చెయ్యపేటతో పాటు మరో పది పంచాయతీలను వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇటీవల ప్రాదేశిక ఎన్నికల్లో మేజర్‌ పంచాయతీ వడ్డాదిలో మూడు ఎంపీటీసీలకు గాను రెండు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోగా,  తాజాగా పంచాయతీ ఎన్నికల్లో 1,084 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి దాడి గోవిందరావు విజయం సాధించాడు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు స్వగ్రామం వడ్డాదిలో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, ఎంపీపీ గేదెల సత్యనారాయణ తదితర నాయకులు ఎన్నికల ప్రచారం చేసి ఓటర్లకు నగదు పంపిణీ చేసినప్పటికీ వడ్డాది ప్రజలు మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యరి్థకి అఖండ మెజార్టీ ఇచ్చారు.

 మండల కేంద్రం బుచ్చెయ్యపేటలో రెండు ఎంపీటీసీలకు గాను ఒకటి వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. సర్పంచ్‌ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి సుంకరి శ్రీను అధికార పార్టీ అభ్యరి్థపై 414 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. దాంతో స్థానిక ఎన్నికల్లో మేజర్‌ పంచాయతీతో పాటు మండల కేంద్రంలో టీడీపీ పట్టు కోల్పోయింది. గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు నెరవేర్చకపోగా, నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు. కూటమి పాలన వచ్చిన తర్వాత కొత్తగా ఒక పింఛన్‌ గాని, ఇల్లు గాని మంజూరు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో కూటమికి గుణపాఠం కలిగేలా ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటేసి అత్యధిక సీట్లు గెలిపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి నేతలు ఓటర్లను భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, డబ్బు, మద్యం, వంటివి ఎరవేసి ఓట్లు వేయించుకుని గెలవాలని చూసినా గట్టి షాకిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పార్టీ మండల నాయకుల రాజనీతి పాలన చూసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కూటమి పాలనపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో మండలంలోని స్థానిక ఎన్నికల ఫలితాలే నిరూపిస్తున్నాయి. ఈ ఫలితాలే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ గెలుపునకు దోహదపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement