దూసుకొచ్చిన మృత్యువు..! | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు..!

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

హైవేపై లారీని తప్పించబోయి అదుపుతప్పిన భారీ ట్రాలీ

బైక్‌పై పడిన భారీ ఇనుప చుట్టలు

డిగ్రీ విద్యార్థిని దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు

న్యాయం చేయాలంటూ సహచర విద్యార్థుల ఆందోళన

రేగుపాలెం హైవే కూడలిలో స్తంభించిన ట్రాఫిక్‌

యలమంచిలి రూరల్‌: రోడ్డుపై దూసుకొచ్చిన భారీ ఇనుప చుట్టలు ఓ డిగ్రీ విద్యార్థిని ప్రాణాలను బలిగొన్నాయి. రేగుపాలెం హైవే కూడలి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఎస్సీ విద్యార్థిని కళ్లెం నాగసాయి లక్ష్మి(20) దుర్మరణం పాలైంది. ఆమెతో పాటు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మట్టా అప్పలరాజు తీవ్రంగా గాయపడ్డాడు. కళాశాలకు వెళ్తూ తోటి విద్యార్థిని మృత్యువాత పడటంతో సహచర విద్యార్థులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో హైవే కూడలి వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

లారీని తప్పించబోయి బోల్తా.. యలమంచిలి మండలం మన్యంపాలెం గ్రామానికి చెందిన నాగసాయి లక్ష్మి, అదే గ్రామానికి చెందిన అప్పలరాజు శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై యలమంచిలి బయలుదేరారు. ఉదయం 9 గంటల సమయంలో రేగుపాలెం హైవే కూడలికి చేరుకుని 16వ నంబరు జాతీయ రహదారి దాటి యలమంచిలి వైపు వెళ్లేందుకు ఆగారు. వారి ముందు మరో లారీ కూడా హైవే దాటేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో ఆ లారీ ఒక్కసారిగా ముందుకు కదలడంతో అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్తున్న భారీ ట్రాలీ లారీ డ్రైవర్‌ అప్రమత్తమయ్యాడు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించేందుకు వాహనాన్ని కుడివైపునకు మళ్లించడంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ట్రాలీపై ఉన్న రెండు భారీ ఇనుప చుట్టలు రోడ్డుపైకి జారిపడగా, వాటిలో ఒకటి నేరుగా ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. హైవే అంబులెన్సులో క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నాగసాయి లక్ష్మి మృతి చెందింది. అప్పలరాజుకు చికిత్స కొనసాగుతోంది.

క్రేన్లతో ఇనుప చుట్టల తొలగింపు.. రేగుపాలెం హైవే కూడలి వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రెండు క్రేన్లను రప్పించి రోడ్డుపై పడిన భారీ ఇనుప చుట్టలు, వాహనాల భాగాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పటివరకు తమతో నవ్వుతూ గడిపిన కుమార్తె రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. నాగసాయి లక్ష్మి మృతితో సహచర విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు.

విద్యార్థుల ఆందోళన

మృతురాలు యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ మూడో సంవత్సరం చదువుతోంది. సహచర విద్యార్థిని మృతి వార్త తెలుసుకున్న కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకుని రహదారిపై బైఠాయించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్‌, పట్టణ ఎస్‌ఐలు ఉపేంద్ర, సావిత్రి ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. తమ డిమాండ్లను రాతపూర్వకంగా అందించాలని సూచించారు. మృతురాలికి బీమా పరిహారం అందేలా చూస్తామని పోలీసులు వివరించడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement