● నాలుగు మండలాల్లో 87 పంచాయతీలు, 527 వార్డుల్లో రేపు పోలింగ్
● సర్పంచ్‌ల బరిలో 452 మంది
● వార్డు సభ్యుల బరిలో 1315 మంది
పెదబయలు మండలం కిముడుపల్లి గ్రామ సచివాలయం
సాక్షి, పాడేరు: మన్యంలో రెండవ విడత పంచాయ తీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లాలోని రెండవ విడతలో అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లోని 87 పంచాయతీలు, 527 వార్డు స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల బరిలో
జిల్లాలోని 87 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు భారీగానే పోటీ నెలకొంది. అనంతగిరి మండలంలోని 24 పంచాయతీలకు 101మంది, జి.మాడుగులలో 17 పంచాయతీలకు 98 మంది, పెదబయలులో 23 పంచాయతీలకు 133 మంది, ముంచంగిపుట్టులో 23 పంచాయతీల కు 120మంది అభ్యర్థులు మొత్తం 87 స్థానాలకు 452 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే వార్డు సభ్యులకు సంబంధించి అనంతగిరిలో 232 స్థానాలకు 93 స్థానాలు ఏకగ్రీవం కాగా 139 స్థానాలకు 342 మంది, జి.మాడుగుల మండలంలో 188 స్థానాలకు 35మంది ఏకగ్రీవం కాగా, 153 స్థానాల్లో 407 మంది, పెదబయలు మండలంలో 232 స్థానాలకు 96 ఏకగ్రీవం కాగా, 136 స్థానాల్లో 331 మంది, ముంచంగిపుట్టులో 228 స్థానాలకు 126 ఏకగ్రీవం కాగా,102 స్థానాల్లో 235మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.
పోలింగ్‌కు ఏర్పాట్లు
జిల్లాలోని రెండవ విడతలోని నాలుగు మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిశాంతి ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 87 పంచాయతీ, 527 వార్డు సభ్యుల ఎన్నికలకు గాను పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని మండల పరిషత్ కార్యాలయాల నుంచి శనివారం ఉదయం బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో పాటు ఎన్నికల సామగ్రిని పోలీసు భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ జరగనుంది. ఆర్టీసీ బస్సులతో పాటు , ప్రైవేట్ వాహనాలను ఎన్నికల రవాణాకు వినియోగిస్తున్నారు.ఈ నాలుగు మండలాల్లోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘాతో పాటు అధిక పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించిన అనంతరం వార్డులు, పంచాయతీల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రం నుంచే వార్డు సభ్యులు,పంచాయతీ సర్పంచ్ స్థానాల విజేతలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.


